Khammam BRS Meeting Updates: ముగిసిన బీఆర్‌ఎస్‌ ఖమ్మం సభ

KCR Party BRS Maiden Public Meeting Khammam Live Updates - Sakshi

Upadates: 

Time 5.45 PM 
చివరగా అథితులుగా వచ్చిన సీఎంలు, నేతలకు ఘన సత్కారంతో సభను ముగించారు. 

Time 5. 40 PM

దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్‌ఎస్‌ భేరి ఒక సంకేతమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. 

భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఫర్వాలేదు.. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తాము. అగ్నిపథ్‌కు కూడా రద్దు చేస్తాము. ఎల్‌ఐసీని ప్రభుత్వపరం చేస్తాము.  రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బీజేపీది ప్రైవేటైజేషన్‌ అయితే బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్‌. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్‌ కోతలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్‌ అందిస్తాము.

Time 5.20 PM

కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ, పంజాబ్‌లో ‍కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు.  ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. 

ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్‌ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్‌ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.  అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Time 4.41 PM

భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు?. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్‌ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్‌ నేషన్‌.. వన్‌ లీడర్‌.. వన్‌ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని డి. రాజా పేర్కొన్నారు. 

Time 4.02  PM

దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కేసీఆర్‌ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి.

కేంద్రానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందని అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. 

Time 3.56 PM

దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి.  కేసీఆర్‌ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్‌ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని కేరళ సీఎం ప్రకటించారు.

Time: 3.35 PM

సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు, అఖిలేష్‌ యాదవ్‌, డి. రాజా ఉన్నారు. 

Time: 2.30 PM

►రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. జాతీయ నేతలు, సీఎంల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు.

Time: 02.00PM
►యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.

జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత చాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. అనంతరం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ నేతల చేతులమీదుగా కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు.

Time: 12.30PM
సీఎం కేసీఆర్‌తో కలిసి ఆప్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్‌ వారికి వివరించారు. తరువాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు.

Time: 11.30AM
► తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇతర జాతీయ నేతలు యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం తర్వాత ఖమ్మం సభకు నేతలు వెళ్లనున్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్‌, సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దైవ దర్శనానికి వెళ్లలేదు. గెస్ట్‌హౌజ్‌లోనే ఉండిపోయారు.

సాక్షి,  ఖమ్మం: చారిత్రక సభకు ఆతిథ్యమిచ్చేందుకు ఖమ్మం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండడంతో సభావేదిక, చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నగరమంతా గులాబీ నగిషీలు తొడుక్కుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సారథ్యాన ఏర్పాట్లు పూర్తి కాగా, మరోపక్క నూతన కలెక్టరేట్‌ సముదాయం పుష్పగుచ్ఛంలా ముస్తాబైంది. ముఖ్యఅతిథులు తొలుత కలెక్టరేట్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటివెలుగును ప్రారంభిస్తారు. అలాగే మెడికల్‌ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించాక ఆవిర్భావ సభకు హాజరవుతారు.

జాతరలా తరలివచ్చేలా..
బీఆర్‌ఎస్‌ తొలి సభ ఖమ్మంలో ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి పార్టీ యంత్రాంగం జన సమీకరణకు సర్వశక్తులొడ్డుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆరుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 18 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ తొలి సభ కావడం, నాలుగు రాష్టాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు వస్తుండడంతో విజయవంతాన్ని ఈ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

సభావేదిక ప్రత్యేకతలు.. 
సభా ప్రాంగణం  : 100 ఎకరాలు
వేదిక : జర్మనీ టెక్నాలజీ వాటర్, ఫైర్‌ రూఫ్‌ (గులాబీరంగు)
హాజరయ్యే జనం (అంచనా : 5 లక్షలు
ప్రాంగణంలో కుర్చీలు  : లక్ష
వేదికపై కూర్చునేది : సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్‌సింగ్‌మాన్, మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్,  సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం, పీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,  రాష్ట్ర మంత్రులు 
సభావేదిక ముందు: ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర ముఖ్య అతిథులు
అధ్యక్షత  : ముఖ్యమంత్రి కేసీఆర్‌
ప్రసంగించేది: సీఎంలు పినరయ్‌ విజయన్, భగవంత్‌ సింగ్‌మాన్,     కేజ్రీవాల్,అఖిలేష్‌ యాదవ్, డి.రాజా, చివరన సీఎం కేసీఆర్‌
సభా సమయం : మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు.  

సీఎంల పర్యటన షెడ్యూల్‌
ఖమ్మం కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంతోపాటు బీఆర్‌ఎస్‌ తొలి సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ సింగ్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఖమ్మం రానున్నారు. వీరి పర్యటన షెడ్యూల్‌ ఇలా ఉంది. 

► సీఎంలు అరవింద్‌  కేజ్రీవాల్, భగవంత్‌ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.
► సీఎం కేసీఆర్‌తో కలిసి బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరి 10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుంటారు. అక్కడ 10.40గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాక 11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 

► ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తోపాటు కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.
►  మధ్యాహ్నం 2.25 గంటలకు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బీఆర్‌ఎస్‌ సభాస్థలి వద్దకు చేరుకుంటారు.
►  ఈ సభలో తొలుత ముందుగా సీఎం పినరయి విజయన్‌ మాట్లాడగానే హెలీకాప్టర్‌లో విజయవాడ బయలుదేరతారు. ఆ తర్వాత మిగతా అతిథులు ప్రసంగిస్తారు. సభ  ముగిశాక కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌ సాయంత్రం 5 గంటలకు, ఆతర్వాత అఖిలేష్‌ యాదవ్‌ విజయవాడ వెళ్లి అక్కడి నుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు వెళ్తారు. 
► సీఎం కేసీఆర్‌ కూడా ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ బయలుదేరతారు. 

తొమ్మిది మంది సీనియర్‌ ఐపీఎస్‌లకు బాధ్యతలు
ఖమ్మం నగరాన్ని పోలీసులు గుప్పిట్లోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌ మాన్, పినరయి విజయన్‌ తదితరులు వస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉండడంతో పంజాబ్, ఢిల్లీకి సంబంధించిన సీఎంల సెక్యూరిటీ వింగ్‌ అధికారులు చేరుకుని సభావేదిక, ప్రాంగణం, నూతన కలెక్టరేట్‌ను పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో నలుగురు సీఎంలు తొలిసారి ఒకే వేదికపైకి రానుండడంతో నిఘా కట్టుదిట్టం చేశారు.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలను తొమ్మిది మంది సీనియర్‌ ఐపీఎస్‌లు పర్యవేక్షిస్తుండగా, 5,210 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కాగా, కలెక్టరేట్‌ నుంచి పది వాహనాలతో సభావేదిక వద్దకు కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టారు. అలాగే, పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌తో పాటు పోలీసు కమిషనరేట్‌లో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేశారు. 

నిఘా నీడలో ఖమ్మం!
బీఆర్‌ఎస్‌ సభ సందర్భంగా నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలే కాకుండా ఐదు లక్షల మంది మేర కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి నుంచి పోలీసు సిబ్బందికి విధులు కేటాయించగా వారంతా జిల్లాకు చేరుకున్నారు. వీరిలో డీఎస్పీ ఆపైస్థాయి అధికారులకు గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస ఏర్పాటు చేయగా మిగతా వారికి కళ్యాణమండపాలు, హాస్టళ్లలో వసతి కల్పించారు. అలాగే, నగరంలోని వాసవీ గార్డెన్స్, మంచికంటి భవన్, తనికెళ్ల, బైపాస్‌రోడ్లలోని ఫంక్షన్‌ హాళ్లలో మెస్‌లు ఏర్పాటుచేశారు.

బందోబస్తుకు 5,200మంది
ఖమ్మంతోపాటు ఇతర జిల్లాలనుంచి సుమారు 5,210మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఇందులో ఏఎస్పీలు పది మంది, ఏసీపీలు 39, సీఐలు, ఆర్‌ఐలు 139మంది, ఎస్సైలు 409మంది, ఏఎస్సైలు 530మంది, కానిస్టేబుళ్లు 1,772మంది, మహిళా కానిస్టేబుళ్లు 169మంది, హోంగార్డులు 1,005 మందితో పాటు స్పెషల్‌ పార్టీలు, రోప్‌ పార్టీ సిబ్బంది ఉన్నారు. ఇక భారీగా జనం హాజరుకానుండడంతో పిక్‌ పాకెటర్లు, పాత నేరస్తులపై సీసీఎస్‌ పోలీసులు నిఘా వేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌ నుంచి 150మంది ఇంటిలెజెన్స్‌ సిబ్బంది చేరుకోగా, వీరిలో ఐజీ స్థాయి మొదలు ఉద్యోగులు ఉన్నారు. 

ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి
బహిరంగ సభకు వివిధ జిలాల్ల నుంచి కార్యకర్తలు హాజరుకానుండడంతో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు కేటాయించగా, అక్కడ వాహనాలు నిలిపి సభకు వెళ్లేలా సూచనలు చేశారు. అలాగే, వాహనాలు వచ్చివెళ్లే మార్గాలను కూడా ప్రకటించారు. రహదారులు, బ్రిడ్జిలపై వాహనాలు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే పక్కకు తొలగించేలా బోయింగ్‌ వాహనాలు సిద్ధం చేశారు.

ప్రారంభానికి ముస్తాబు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ – ఐడీఓసీ) ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మూడు రాష్ట్రాల సీఎంలు కలెక్టరేట్‌తో పాటు ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగును బుధవారం ప్రారంభించనుండడంతో మంగళవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐడీఓసీ మొత్తాన్ని అందంగా పూలతో అలంకరించి లైట్లు అమర్చడంతో రాత్రివేళ జిగేల్‌మంటూ కనిపించింది. సీఎంలు, ఇతర ముఖ్యులు కలెక్టరేట్‌లోనే మధ్యాహ్న భోజనం చేయనుండడంతో మొదటి అంతస్తు స్టేట్‌ చాంబర్‌ పక్కనే ఉన్న చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌(సీపీఓ) చాంబర్‌లో ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top