అధ్యక్షుడికి విస్తృతాధికారాలు...

KCR Elects As TRS President 9th Time - Sakshi

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల నియామకాధికారం అప్పగింత..

అధ్యక్షుడు అందుబాటులో లేని సమయంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌దే అధికారం 

పార్టీ నియమావళికి 3 కీలక సవరణలు 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సంస్థాగత కమిటీల ఏర్పాటులో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు విస్తృత అధికారాలు అప్పగిస్తూ సోమవారం జరిగిన ప్లీనరీ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నియమావళిని సవరించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు కలిగి ఉంటారు. అలాగే జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలకు కార్యవర్గాలను నియమించే అధికారాన్ని కూడా అధ్యక్షుడికి అప్పగించారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీలకు కార్యవర్గాలు ఏర్పాటయ్యాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీనీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా ఉండగా పార్టీ అధ్యక్షుడు అందుబాటు లో లేని సమయంలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు కట్టబెడుతూ నియమావళిని సవరించారు.


వేదికపై కేసీఆర్‌తో మాట్లాడుతున్న కేటీఆర్‌   
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు సభ్యత్వ నమోదు, పార్టీ కార్యాలయాల నిర్మాణం, సంస్థాగత కమిటీల ఏర్పాటు వంటి పనులను ఇప్పటికే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఇటీవల 103 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఇలా ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న కేటీఆర్‌కు ప్రస్తుత సవరణ ద్వారా మరిన్ని అధికారాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.  

ఉప ఎన్నిక తర్వాత కమిటీలపై దృష్టి 
ప్రస్తుతం పార్టీ నియమావళికి చేసిన సవరణ మేరకు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత కమిటీల ఏర్పాటుపై కేసీఆర్‌ దృష్టి సారించనున్నారు. జిల్లా అధ్యక్ష పదవులతో పాటు పార్టీ కార్యవర్గంలో చోటు ఆశిస్తున్న ఔత్సాహిక నేతల జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇప్పటికే అధినేతకు అప్పగించారు. వచ్చే 9 నెలల పాటు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసే యోచనలో ఉన్న కేసీఆర్‌.. అసెంబ్లీ నియోజకర్గ స్థాయిలోనూ కమిటీల ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top