ఆర్టీసీ పొమ్మన్నా.. చేను చేరదీసింది..

Karimnagar: RTC Driver Turn Into Farmer, Grow Vegetables On His Farm - Sakshi

గతేడాది లాక్‌డౌన్‌తో సెక్యూరిటీగార్డు ఉద్యోగం కోల్పోయిన శ్రీనివాస్‌

రూ.లక్ష అప్పుచేసి సెకండ్‌హ్యాండ్‌ ఆటో కొనుగోలు

కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రాకపోవడంతో సరికొత్త ఆలోచన

సొంతంగా కూరగాయలు సాగుచేస్తూ.. విక్రయిస్తున్న వైనం

అప్పుతీర్చి.. ఆదర్శంగా నిలుస్తున్న పెసరి శ్రీనివాస్‌

సాక్షి, హుస్నాబాద్‌: నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ సంస్థ జీతాలు ఇవ్వలేమని వెళ్లగొట్టింది. 13 ఏళ్లు పనిచేయించుకుని కరోనా మొదటివేవ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగం నుంచి తీసేసింది. తనకొచ్చిన డ్రైవింగ్‌తో కుటుంబాన్ని పోషించుకుంటానని రూ.లక్ష అప్పుచేసి ఆటో కొనుగోలు చేశాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆటోల్లో ఎవరూ ఎక్కకపోవడంతో డీజిల్‌ ఖర్చులు కూడా రాలేదు. అధైర్య పడకుండా సాగురంగం వైపు దృష్టిసారించాడు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన పెసరి శ్రీనివాస్‌.

సుందరగిరి గ్రామానికి చెందిన పెసరి శ్రీనివాస్‌కు భార్య సుజాత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య కూలీ పని చేస్తుండగా.. పిల్లలు 9,10వ తరగతి చదువుతున్నారు. కుటుంబ పోషణకోసం 13 ఏళ్లుగా కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో సెక్యూరిటీగార్డుగా పనిచేశాడు. రోజుకు 12 గంటల డ్యూటీ చేయగా.. రూ.9,500 జీతం వచ్చేది. వచ్చిన జీతం సరిపోయేది కాదు. ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, కరోనా లాక్‌డౌన్‌తో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. సంస్థలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తీసివేయడం ప్రారంభించింది ఆర్టీసీ. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో పాటు మరికొందరు సెక్యూరిటీ గార్డులను ఉద్యోగానికి రావొద్దని చెప్పారు.

దీంతో కుటుంబపోషణ కోసం శ్రీనివాస్‌ రూ.లక్ష అప్పుచేసి సెకండ్‌హ్యాండ్‌లో ఆటో కొనుగోలు చేశాడు. రెండు నెలల పాటు హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌ నడిపించాడు. జనాలు కరోనా భయంతో ఎక్కకపోవడంతో డీజిల్‌ ఖర్చులు కూడా సరిగా వచ్చేవికావు. అప్పులు పెరిగిపోయాయి. దీంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నాడు. వివిధ రకాల కూరగాయలు సాగు చేయడం ప్రారంభించాడు. వచ్చిన పంటను తన ఆటోలో తీసుకుని పోయి.. వివిధ గ్రామాల్లో, వారసంతల్లో అమ్మడం ప్రారంభించాడు. దాదాపు ఏడాది కాలంగా ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. వచ్చిన ఆదాయంతో అప్పులు తీరాయని, ఇల్లు గడుస్తోందని, తన భార్య కూడా కూరగాయల సాగులో భాగస్వామ్యం అవుతోందని శ్రీనివాస్‌ చెబుతున్నాడు. చేయాలనే సంకల్పం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని శ్రీనివాస్‌ సూచిస్తున్నాడు. 

చదవండి: జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top