రాత్రిపూట డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో చెలరేగిన మంటలు, అగ్గి అంటుకున్న డంపింగ్ యార్డు నుండి వెలువడుతున్న పొగ
ఏళ్లుగా డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలకు ఇబ్బందులు
ఊపిరాడక ఆక్సిజన్ సిలిండర్లు కొంటున్న ప్రజలు
22 డివిజన్ల పరిధిలో సమస్య తీవ్రం
సాక్షి తెలంగాణ: దాదాపు నాలుగు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పీల్చుకునేందుకు స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. నగరంలోని మానేరు నది పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్‌లో కాలుతున్న చెత్త కారణంగా వెలువడుతు న్న పొగతో పలువురు కేన్సర్, ఆస్తమాలతో ఇబ్బందులు పడుతున్నారు. 66 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌లో ఏకంగా 22 డివిజన్ల పరిధిలో ప్రతీరోజూ ఊపి రి పీల్చుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు.
అసలేంటి సమస్య?
కరీంనగర్ నగరంలో 3,90,000 వరకు జనాభా ఉంది. నగరంలో డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. ప్రతీరోజూ బల్దియా 150 మెట్రిక్ టన్నుల మేరకు వ్యర్థాలు సేకరించి ఇక్కడే డంప్ చేస్తుంది. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మానేరు నదీ తీరాన పేరుకుపోయి గుట్టలను తలపిస్తోంది. ఇక్కడకు వచ్చిన చెత్తను బయోమైనింగ్ పేరిట ప్రాసెస్ చేస్తున్నారు. కానీ, ఆ చెత్తను కాల్చడం వల్ల 24 గంటలు వెలువడుతున్న పొగతో 07, 09, 10,11, 27, 30, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 53, 57, 58, 41, 42, 65, 66వ డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చదువుకుంటున్న విద్యార్థిని, నా ఆరోగ్యం కాపాడండి అంటూ ప్లకార్డుతో చిన్నారి
డంపింగ్ యార్డుతో ప్రజలు ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ చెప్పారు. ఈ సమస్యపై అధ్యయనం చేసి రూ.17 కోట్ల స్వచ్ఛ్‌భారత్ నిధులతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించామన్నారు.అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) నిధులతో రూ.80 కోట్లతో సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారానికి త్వరలో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు.
అలకాపురికాలనీలో డంప్‌యార్డు పొగ సమస్య వల్ల దుంపేటి రాముతోపాటు మరో నలుగురు ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆర్డర్ పెట్టారు. కాలనీలో దాదాపు ఆరుగురు ఎయిర్ ఫ్యూరిఫయర్లు వాడుతున్నారు. అదే కాలనీలో నివసిస్తున్న పోలీస్, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఇళ్లల్లో పిల్లల కోసం ఎయిర్ ప్యూరీఫయర్లు కొనుగోలు చేస్తున్నారు.
ఆక్సిజన్ కొనాల్సి వస్తుంది..
రాత్రిపూట వెలువడుతున్న పొగ వల్ల ఊపిరి ఆడటం లేదు. చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏసీలు ఆపేయాల్సి వస్తుంది. నా పిల్లల కోసం రూ.800తో ఆక్సిజన్ సిలిండర్లు కొంటున్నా. ఇలా ఎంతకాలం కొనగలం.
– దుప్పేటి రాము, అలకాపురి కాలనీ, వ్యాపారి
ప్రతి నిమిషం పొగ తాగినట్టే...
డంప్ యార్డు నుంచి వచ్చే పొగ ప్రమాదకం. ఇది ఊపిరితిత్తుల రక్షణ కవచాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా పిల్లల్లో ఆస్తమా, సీఓపీడీ వ్యాధులు వస్తాయి. వృద్ధులలో బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి. ఈ పొగ పీల్చడం ప్రతి నిమిషం సిగరేట్ తాగిన దానితో సమానం.
– డాక్టర్ సాయిని నరేందర్, పల్మనాలజిస్టు


