పిట్టకొంచెం.. ‘వ్యూస్‌’ ఘనం.. 

Kamareddy: Seven Years Old Child Making Videos On Youtube - Sakshi

యూట్యూబ్‌లో రాణిస్తున్న చిన్నోడు 

నటనతో నవ్వులు పూయిస్తున్న వైనం 

ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డ్‌ రేసులో చతురణన్‌ 

సాక్షి, కామారెడ్డి:  ఆ బుడతడి వయసు ఏడేళ్లు.. చదివేది ఒకటో తరగతి.. కానీ అతడు చేసే యాక్టింగ్‌ యూట్యూబ్‌లో నవ్వులు పూయిస్తోంది. లక్షలాది మందికి ఆనందం పంచుతోంది. ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డు రేసులో నిలిచిన చతురణన్‌పై సండేస్పెషల్‌.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అర్చన, సంతోష్‌ దంపతుల కుమారుడైన చతురణన్‌ బుడిబుడి అడుగులు వేసేటప్పుడే టీవీల్లో వస్తున్న సినిమాలను చూసి దానికి తగ్గట్టుగా డ్యాన్స్‌ చేసేవాడు.

మూడేళ్ల వయసులోనే ఎంతో శిక్షణ తీసుకున్నవాడిలా నృత్యం చేయడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. డ్యాన్స్‌ను వీడియో తీసి బంధువులకు, స్నేహితులకు పంపించేవారు. అందరూ చతురణన్‌ డ్యాన్స్‌ను చూసి మురిసిపోయేవారు. స్కూ ల్‌ నుంచి రాగానే టీవీలో ఏదో ఒక పాట పెట్టుకోవడం, డ్యాన్స్‌ చేయడం చేసేవాడు. కొడుకులో ఉన్న టాలెంట్‌ను గమనించిన తండ్రి సంతోష్‌.. వివిధ సినిమాల పాటలు, టీజర్లను చూపించి, అలాగే చేయమంటూ ప్రోత్సహించాడు.

కుమారుడి నటనను కెమెరాలో బంధించేవాడు. ఒక సినిమా టీజర్‌ రిలీజ్‌ అవ్వడమే ఆలస్యం.. దాన్ని మించి నటిస్తూ అందరినీ ఆకట్టుకోసాగాడు. తర్వాత ‘చతుర్‌ డార్లింగ్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు. చతురణన్‌ వీడియోలను అందులో అప్‌లోడ్‌ చేస్తూ వస్తున్నాడు.  

ఇప్పటికే 39 వీడియోలు... 
చతురణన్‌ యాక్టింగ్‌కు సంబంధించి యూట్యూ బ్‌లో ఇప్పటివరకు 39 వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. చానల్‌కు సుమారు 6 వేల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. వేలమంది వీడియోలను వీక్షి స్తున్నారు. ‘పుష్ప’ స్పూఫ్స్‌ను లక్షలాది మంది చూశారు. బీమ్లానాయక్‌ టీజర్‌ స్పూఫ్‌సైతం నవ్వులు పూయిస్తోంది. వాటిని చూసివారు ఈ బుడ్డోడు మామూలోడు కాదంటున్నారు. 

అవార్డు రేసులో... 
ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌–2022 బెస్ట్‌ యాక్టింగ్‌ కేటగిరిలో చతురణన్‌ నామినేట్‌ అయ్యాడు. ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. అత్యధిక ఓట్లు పొందిన వారిని విన్నర్‌గా ప్రకటించి, ఈనెల 18న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారని చతురణన్‌ తండ్రి సంతోష్‌ తెలిపారు. నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న ఈ బుడ్డోడు.. అవార్డు రేసులో ఎంతవరకు నెగ్గుకువస్తాడో చూడాలి.  

మూడేళ్ల నుంచే.. 
మా బాబుకు చిన్నప్పటినుంచే యాక్టింగ్‌ అంటే ఇష్టం. మూడేళ్ల వయసులోనే వాడిలోని ప్రతిభను గమనించాం. ప్రోత్సహిస్తుండడంతో చాలాబాగా నటిస్తున్నాడు. వాటిని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాను. వ్యూయర్స్‌నుంచి మంచి స్పందన వస్తోంది.  
– సంతోష్, చతురణన్‌ తండ్రి, కామారెడ్డి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top