ఈ రోజుల్లో యూట్యూబ్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే రోజూ కొత్త వీడియోలు చేయడం క్రియేటర్లకు కొంత కష్టంగా మారుతోంది. ఈ సమయంలో.. యూట్యూబ్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. అదే ఏఐ డిజిటల్ ట్విన్ (డిజిటల్ క్లోన్). యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన 206 వార్షిక లేఖలో ఈ ఫీచర్ గురించి వెల్లడించారు.
ఏఐ డిజిటల్ ట్విన్ ద్వారా.. క్రియేటర్స్ ఏఐ జనరేటెడ్ వెర్షన్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తమలాగే కనిపించే ప్రతిరూపం సాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.
ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?, ఇదెలా పని చేస్తుంది? అనే విషయాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఇది ఓపెన్ఏఐ సొర యాప్ మాదిరిగా ఫోటోరియలిస్టిక్ వెర్షన్‌లను సృష్టించడానికి ఎలా అనుమతిస్తుందో అదే విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ షార్ట్స్ రోజుకు 200 బిలియన్ వ్యూవ్స్ పొందుతున్నాయి. ఈ సమయంలో దీనికోసం కొత్త ఫీచర్స్ కూడా సంస్థ సీఈఓ మోహన్ వెల్లడించారు. ఇందులో ఇమేజ్ పోస్ట్‌లను నేరుగా ఫీడ్‌లోకి జోడించవచ్చు. పిల్లలు & టీనేజర్లు షార్ట్స్ స్క్రోలింగ్ చేయడానికి ఎంత సమయం వెచ్చించాలనేది కూడా తల్లిదండ్రులకు కంట్రోల్ చేయవచ్చు. దీనికోసం కూడా ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత పేరెంట్స్ టైమర్ సెట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!


