ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై క్రియేటర్లు కెమెరా ముందుకు రాకుండానే, తమలాగే కనిపించే ‘ఏఐ డిజిటల్ ట్విన్’ (కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతిరూపం) సహాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేయవచ్చు. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ తన 2026 వార్షిక లేఖలో ఈ విప్లవాత్మక ఫీచర్ గురించి వెల్లడించారు.
ఈ నూతన ఆవిష్కరణ ఓపెన్ ఏఐకి చెందిన ‘సోరా’ యాప్ తరహాలో పని చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ సొంత ముఖ కవళికలతో, తమ గొంతుతోనే వీడియోలను సులభంగా రూపొందించుకునే వెసులుబాటు కలగనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందనే దానిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాకపోయినప్పటికీ, ఇది యూజర్ల సెల్ఫీ క్లిప్, ఆడియో రికార్డింగ్ ఆధారంగా 3D అవతార్‌ను సృష్టిస్తుందనే అంచనాలున్నాయి.
అయితే ఏఐ అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమేనని, ఇది మనిషి సృజనాత్మకతను పూర్తిగా భర్తీ చేయలేదని నీల్ మోహన్ స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో క్రియేటర్లకు వీడియోల తయారీలో శ్రమ తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం. మరోవైపు డీప్‌ఫేక్ వీడియోలపై కూడా యూట్యూబ్ అప్రమత్తమైంది. తమ ఏఐ టూల్స్ ద్వారా రూపొందించిన వీడియోలకు ‘సింథటిక్ కంటెంట్’ అని స్పష్టంగా లేబుల్ వేస్తామని, క్రియేటర్లు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
క్రియేటర్ల అనుమతి లేకుండా వారి ముఖాన్ని ఎవరైనా వాడితే, దానిని నియంత్రించే టూల్స్ కూడా అందుబాటులోకి తేనున్నారని తెలుస్తోంది.
షార్ట్స్ వీడియోలు రోజుకు సగటున 200 బిలియన్ల వ్యూస్ సాధిస్తున్న తరుణంలో, యూట్యూబ్ మరిన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇకపై షార్ట్స్ ఫీడ్‌లో నేరుగా ఇమేజ్ పోస్ట్‌లను యాడ్ చేసుకునే వెసులుబాటు రానుంది. అలాగే పిల్లలు, టీనేజర్లు షార్ట్స్ చూసే సమయాన్ని తల్లిదండ్రులు నియంత్రించేలా కొత్త ‘పేరెంటల్ కంట్రోల్స్’ రాబోతున్నాయి.
ఇది కూడా చదవండి: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు: మాజీ ఎంపీకి ఊరట


