న్యూఢిల్లీ: నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు(1984)కు సంబంధించిన ఒక కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి గురువారం ఉపశమనం లభించింది. దేశ రాజధానిలోని జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో అల్లర్లను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జన్ కుమార్‌ను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన దరిమిలా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి దిగ్ వినయ్ సింగ్.. సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి స్థాయి, లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. న్యాయమూర్తి వెల్లడించిన కారణాలు, తీర్పులోని ఇతర అంశాలు ఆ ఆర్డర్ కాపీలో స్పష్టంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ తాజా తీర్పుతో సజ్జన్ కుమార్‌కు ఊరట లభించినప్పటికీ, ఆయన జైలు నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. ఆయన ప్రస్తుతం వేరే కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో నమోదైన ఇతర తీవ్రమైన అభియోగాల కారణంగా ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ల హత్యకు సంబంధించిన కేసులో సజ్జన్ కుమార్ ఇప్పటికే దోషిగా తేలారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు గత ఏడాది ఫిబ్రవరి 25న జీవిత ఖైదు విధించింది.


