
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఒకటిరెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోగా, ఆయనకు విమానాశ్రయంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్, సీఈ విజయ్‌భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండగా, ఆలోపే ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు జస్టిస్ ఘోష్ ఏర్పాట్లు చేసుకున్నారు.
నివేదికలోని అంశాలు బయటకి పొక్కకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 16 నెలలకు పైగా విచారణ నిర్వహించింది.