
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీపై ఊహాగానాలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశం..
నోటిఫికేషన్‌కు ముందే విస్తృత ప్రచారం
అభ్యర్థుల ప్రకటనకు ముందే..వాడవాడలా, ఇంటింటికీ..
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పారీ్టలకూ ఈ ఉప ఎన్నిక సవాల్‌గానే కాక, రాబోయే జీహెచ్‌ఎంసీ పాలకమండలి, అసెంబ్లీ ఎన్నికలకు ‘టీజర్’ గానూ మారనుండటంతో అన్ని పారీ్టలూ ఈ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. బహుశా, ఎన్నికల షెడ్యూలు..నోటిఫికేషన్..వెలువడకముందే, అభ్యర్థులెవరో ప్రకటించకముందే విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఎన్నిక ఇదే కాబోలు. ఈ హడావుడి, ప్రచారం చూస్తున్న ప్రజల నుంచి ఇంతకీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు జరగనుందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఎన్నిక ఎప్పుడన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే..
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలోనే బిహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు తదితరమైనవి దృష్టిలో ఉంచుకొని అటు రాజకీయ పారీ్టలు, ఇటు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. బిహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22తో ముగియనుంది. ఆలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. బిహార్‌లో ఛాత్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ పండుగ అక్టోబర్ 28న వస్తోంది. ఆ పండుగ ముగిశాక ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా నవంబర్ 5–15 తేదీల మధ్య బిహార్ ఎన్నికలు జరగ్గలవనే అంచనాలున్నాయి. అందుకు తగిన కారణం కనిపిస్తోంది.
బిహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయ్యాక ఓటర్ల ఫైనల్ జాబితా ఈ నెల 30వ తేదీన వెలువడనుంది. దాని తరువాతే ఎన్నికల షెడ్యూలు వెలువడగలదని అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ఆ మేరకు అక్టోబర్ 3వ తేదీకి అటూ ఇటూగా షెడ్యూలు వెలువడనుంది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య వ్యవధి, తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని నవంబర్ 15లోగా ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఉప ఎన్నిక జరగాల్సి ఉంటే, ఏదైనా రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుతోపాటే వాటికీ వెలువరిస్తారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు చెప్పారు. ఆ లెక్కన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ రెండోవారంలో జరగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నోటిఫికేషన్ రాకున్నా.. ముమ్మర ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడలేదు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక్క బీఆర్‌ఎస్ తప్ప మిగతా పారీ్టల్లో అభ్యర్థి ఎవరన్నదీ సంకేతాలు కూడా లేవు. కానీ, ఈ నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యరి్థగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టిక్కెట్ ఇస్తున్నట్లు చూచాయగా తెలిపింది. సునీతతోపాటు ఆమె కుమార్తెలు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు రోజుకో డివిజన్ చొప్పున బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మన సీటును మనం తిరిగి గెలుచుకోవడమే కాక రాబోయే రోజుల్లో మనదే గెలుపని చెప్పేందుకు ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా ఏకంగా ముగ్గురు మంత్రులు, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలప్పగించింది. వారు బస్తీబస్తీలో తిరుగుతున్నారు. ప్రభుత్వం తరపున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు పారీ్టలు కూడా పోలింగ్ బూత్‌ల వారీగా, ఓటర్ల వారీగా ప్రచార ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఒక్క ఓటు కూడా పోరాదనే విధంగా ప్రతి ఓటరునూ కలిసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. బీజేపీ సైతం తన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇక ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.