
జనగామ జిల్లా: రెండుమూడు గంటల్లో పెళ్లి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఫంక్షన్ హాల్ సందడిగా మారింది. కానీ ఇంతలో ఓ పిడుగు లాంటి వార్త. పెళ్లి కొడుకు తనతో ప్రేమాయణం సాగించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పెళ్లి కూతురు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెళ్లి పీటల మీదనే మూడుముళ్ల బంధం ఆగింది. ఈ ఘటన మండలంలోని వడిచర్ల సమీపం ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంరాజుపలి్లకి చెందిన ఓ యువకుడికి అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.
బుధవారం వివాహం జరగాల్సి ఉంది. అంతా సిద్ధం చేసుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో∙సదరు యువకుడితో ప్రేమాయణం సాగించిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు యువకుడు తనతో ప్రేమాయణం కొనసాగించి మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు యువకుడి వివరాలు తెలుసుకుని పెళ్లి కూతురు బంధువులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్‌లో ఆందోళన నెలకొంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యువకుడి బంధువులతో వాగ్వాదానికి దిగి పెళ్లిని ఆపారు. ఆ యువకుని విషయం తెలియాలని, అంతవరకు ఊరుకునేది లేదంటూ మండిపడి వధువు బంధువులంతా వెళ్లిపోయారు. ఫలితంగా రెండుమూడు గంటల్లో ఏకమయ్యే జంట విడిపోయింది. దీంతో వివాహానికి హాజరైన బంధువర్గమంతా అవాక్కై ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు.
యాదవనగర్‌లో మరో పెళ్లి..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యాదవనగర్‌లో కొద్ది గంటల్లో జరగాల్సిన వివాహ వేడుక అర్ధాంతరంగా ఆగింది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ కథనం ప్రకారం.. యాదవనగర్‌కు చెందిన మహేశ్ పాతడోర్నకల్ చెందిన తన స్నేహితురాలిని నెల రోజుల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మహేశ్ ఇంట్లో చెప్పలేదు. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్‌కు వేరే సంబంధం చూసి బుధవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం రహస్య వివాహం చేసుకున్న యువతి తెలుసుకుని డోర్నకల్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివాహ తంతును అడ్డుకుని మహేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువతి బెంగుళూరులో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.