
ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న తెలుగువారు
ఇజ్రాయెల్‌లో పెద్ద సంఖ్యలో మనోళ్లు
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంతో పెరిగిన ఉద్రిక్తతలు
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రింబవళ్లు సైరన్‌లు మోగుతున్నాయి. క్షిపణుల వర్షం కురుస్తోంది. అయినా ఎ లాంటి భయం లేదు. నిశ్చింతగానే ఉన్నాం’అని ఇజ్రాయెల్‌లో ఉంటున్న పలువురు తెలుగువారు తెలిపారు. రెండు రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుత యుద్ధం కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు తిరిగివచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రవి తెలిపారు. సుమారు 1,000 మంది కార్మికులు ఇజ్రాయెల్‌లోని ఒక్క రమన్‌గాన్ ప్రాంతంలోనే ఉంటున్నట్టు చెప్పారు.
20 క్షిపణులు పడ్డాయి
‘ఈ నెల 14వ తేదీ ఒక్కరోజే 2,000 క్షిపణులు ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయి. అన్నింటిని ఐరన్‌డోమ్‌లు ధ్వంసం చేశాయి. కానీ 20 క్షిపణులు మాత్రం అక్కడక్కడా పలు ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో రిషోల్ లిజియో ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. వివిధ చోట్ల మరో 70 మందికి పైగా గాయపడ్డారు’అని హర్జాలియాలో ఉంటున్న చర్చి ఫాదర్ కొల్లాబత్తుల లాజరస్ తెలిపారు. ఇజ్రాయెల్‌లోని వివిధ నగరాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో కొందరు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, యూరప్ మీదుగా ప్రయాణం చేయాల్సి రావడం వల్ల చార్జీలు పెరిగాయని లాజరస్ చెప్పారు.
ఇంటింటికీ స్ట్రాంగ్ రూమ్‌లు..
తెలుగు రాష్ట్రాల నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లిన వారిలో చాలామంది కేర్‌గివర్స్‌గా పని చేస్తున్నారు. వయోధికులకు సేవలు చేసేందుకు మేల్ నర్స్ తరహాలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళలు సైతం కేర్‌గివర్స్‌గా అక్కడి వృద్ధ మహిళలకు సేవలందజేస్తున్నారు. హౌస్‌కీపింగ్ వర్కర్లుగా కూడా చాలామంది ఉన్నారు. డ్రైవర్లుగా, సహాయకులుగా పనిచేసేవారు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. టెల్ అవీవ్‌కు దూరంగా ఉండే చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలుగువారు చెప్పారు. ‘ప్రతి ఇంటికి, అపార్ట్‌మెంట్‌కు బాంబ్‌షెల్టర్స్, స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రంగా మారి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని భావిస్తే బాంబ్‌షెల్టర్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో తలదాచుకోవచ్చు’అని స్థానికులు తెలిపారు.