breaking news
indians safe
-
తెలుగువారంతా క్షేమమే
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రింబవళ్లు సైరన్లు మోగుతున్నాయి. క్షిపణుల వర్షం కురుస్తోంది. అయినా ఎ లాంటి భయం లేదు. నిశ్చింతగానే ఉన్నాం’అని ఇజ్రాయెల్‌లో ఉంటున్న పలువురు తెలుగువారు తెలిపారు. రెండు రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుత యుద్ధం కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు తిరిగివచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రవి తెలిపారు. సుమారు 1,000 మంది కార్మికులు ఇజ్రాయెల్‌లోని ఒక్క రమన్గాన్ ప్రాంతంలోనే ఉంటున్నట్టు చెప్పారు. 20 క్షిపణులు పడ్డాయి‘ఈ నెల 14వ తేదీ ఒక్కరోజే 2,000 క్షిపణులు ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయి. అన్నింటిని ఐరన్‌డోమ్‌లు ధ్వంసం చేశాయి. కానీ 20 క్షిపణులు మాత్రం అక్కడక్కడా పలు ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో రిషోల్ లిజియో ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. వివిధ చోట్ల మరో 70 మందికి పైగా గాయపడ్డారు’అని హర్జాలియాలో ఉంటున్న చర్చి ఫాదర్ కొల్లాబత్తుల లాజరస్ తెలిపారు. ఇజ్రాయెల్‌లోని వివిధ నగరాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో కొందరు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, యూరప్ మీదుగా ప్రయాణం చేయాల్సి రావడం వల్ల చార్జీలు పెరిగాయని లాజరస్ చెప్పారు.ఇంటింటికీ స్ట్రాంగ్ రూమ్‌లు..తెలుగు రాష్ట్రాల నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లిన వారిలో చాలామంది కేర్‌గివర్స్‌గా పని చేస్తున్నారు. వయోధికులకు సేవలు చేసేందుకు మేల్ నర్స్ తరహాలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళలు సైతం కేర్‌గివర్స్‌గా అక్కడి వృద్ధ మహిళలకు సేవలందజేస్తున్నారు. హౌస్‌కీపింగ్ వర్కర్లుగా కూడా చాలామంది ఉన్నారు. డ్రైవర్లుగా, సహాయకులుగా పనిచేసేవారు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. టెల్ అవీవ్‌కు దూరంగా ఉండే చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలుగువారు చెప్పారు. ‘ప్రతి ఇంటికి, అపార్ట్‌మెంట్‌కు బాంబ్షెల్టర్స్, స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రంగా మారి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని భావిస్తే బాంబ్‌షెల్టర్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో తలదాచుకోవచ్చు’అని స్థానికులు తెలిపారు. -
ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. రష్యన్ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు. ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని మోదీ ఆదేశించారని హర్షవర్దన్ ఉద్ఘాటించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామన్నారు. ఉక్రెయిన్తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 4 వేల మంది తిరిగి వచ్చేశారు. మాకు రక్షణ కల్పించండి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్లు సమాచారం. విద్యార్థులకు అడ్వైజరీ ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖ తెలిపారు. భారత్ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్ పేర్కొన్నారు. రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం తన గగనతలాన్ని మూసివేయడంతో, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గమధ్యంలోనే వెనుదిరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎయిరిండియా విమానం గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి కీవ్‌లోని బోరీస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. అప్పటికే రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానసేవలు చాలా ప్రమాదకరంగా మారినందున ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ సమయంలో ఇరాన్ గగనతలంపై ఉన్న ఆ విమానం తిరిగి వెనుదిరిగింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో 182 మంది భారతీయులు గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది విద్యార్థులేనన్నారు. ఈ నెల 22వ తేదీన ఎయిరిండియా పంపిన మొదటి విమానంలో కీవ్‌లో ఉన్న 240 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఆఖరి క్షణంలో ఆగిపోయారు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి బయలుదేరిన ఇద్దరు భారత విద్యార్థులు రష్యా దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రోణక్ షెరాసియా(18), అతడి స్నేహితుడు మహావీర్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో చెర్నివిట్సీలో ఉన్న బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ(బీఎస్ఎంయూ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారు గురువారం ఉదయం భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తెల్లవారుజామునే కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు చెక్–ఇన్ కౌంటర్ వద్దకు వెళ్లగా విమానం రద్దయ్యిందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదిలేక మళ్లీ బస్సులో యూనివర్సిటీకి బయలుదేరారు. కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా, పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు పలుమార్లు వినిపించాయని రోణక్ షెరాసియా చెప్పాడు. ఆ భీకర శబ్దాలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొన్నాడు. -
మనవాళ్లంతా క్షేమంగానే ఉన్నారు!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు తలపెట్టిన నరమేధంలో భారతీయులు ఎవరూ చనిపోలేదని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. పారిస్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులు అందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందిందని చెప్పారు. 'ఫ్రాన్స్‌లోని భారత రాయబారితో మాట్లాడాను. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో పౌరులంతా ఇళ్లలోనే ఉండాలని ఫ్రాన్స్ ప్రభుత్వం సూచించింది' అని ఆమె శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. పారిస్‌లో విచ్చలవిడిగా తెగబడిన ఉగ్రవాదులు 127మందికిపైగా ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. ఈ నరమేధంలో 200మందికిపైగా గాయపడ్డారు. 2008 ముంబై దాడులను తలపించేలా పారిస్ నగరంలో సాగిన ఈ మారణకాండతో ఫ్రాన్స్‌తో పాటు యావత్ ప్రపంచం నివ్వెరబోయింది.