మధిర నుంచి రాజధానికి మారిన సభ
శిల్పకళా వేదికలో పెట్టుబడి సాయం పంపిణీ కార్యక్రమం
నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు దశలవారీగా భరోసా
మొదటి విడతలో రెండు ఎకరాలలోపు భూమి గల 41.37 లక్షల మంది రైతులకు రూ. 2,482.02 కోట్లు జమ
ఆ తర్వాత గత ఖరీఫ్ మాదిరిగానే ఒక్కో ఎకరం పెంచుతూ ఇవ్వనున్న మొత్తం
ఆన్‌లైన్ ద్వారా రైతువేదికల వద్ద రైతులు వీక్షించేలా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నిధులను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రైతుఖాతాల్లో జమ చేయనుంది. తొలుత ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినా, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్‌కు మార్చారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సీఎం రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా రైతులంతా రైతువేదికల వద్ద వీక్షించే ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,482.02 కోట్లు నేరుగా జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో ఒక ఎకరా ఉన్న రైతులు 14.65 లక్షల మందికాగా వారికి రూ. 878.94 కోట్లు, ఒకటి నుంచి రెండు ఎకరాలున్న భూమి ఉన్నవారు 26.72 లక్షల మంది. వారికి రూ. 1,603.08 కోట్లు చెల్లించనున్నారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ, ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
గత ఏడాది మాదిరిగానే..
గత ఏడాది ఖరీఫ్–2025 సీజన్‌లో ప్రభుత్వం ఐదెకరాల వరకు భూములున్న రైతులకు రైతుభరోసాను నాలుగు విడతల వారీగా పంపిణీ చేసింది. మొదట రెండు ఎకరాల వరకు, అనంతరం ఒక్కో ఎకరం పెంచుతూ ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు దశలవారీగా సాయం అందించింది. మొత్తం దాదాపు 62.47 లక్షల మంది రైతులకు ఒక కోటీ ఏడు లక్షల ఎకరాలకు రూ. 6,404. 69 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
మొదటి విడతలో రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించనుండగా, తర్వాతి విడతల్లో ఒక్కో ఎకరం విస్తీర్ణం పెంచుతూ ఐదెకరాల వరకుగల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. కాగా, గత యాసంగి సీజన్‌లో ఎకరాల విస్తీర్ణంలో కాకుండా రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టుబడి సాయం అందేలా రైతుభరోసా పథకాన్ని మార్చింది. రెండు విడతల్లో ఎకరం చొప్పున సుమారు 71.05 లక్షల మంది రైతులకు రెండు ఎకరాల విస్తీర్ణానికి రైతుభరోసా సాయం అందించింది.
అయితే ఈ ఖరీఫ్‌లో కూడా కొత్త విధానానికి బదులుగా గతంలో అమలు చేసిన పద్ధతినే కొనసాగిస్తూ, చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ రెండెకరాల వరకు ఉన్న రైతులతోనే పంపిణీ ప్రారంభిస్తోంది. దీంతో మొదటి విడతలో చిన్న రైతుల ఖాతాల్లోనే ముందుగా పెట్టుబడి సాయం జమ కానుంది. ఆ తరువాత ఐదెకరాల వరకు విడతల వారీగా జమ కానున్నట్లు సమాచారం. కాగా, రబీ 2025– 26లో రైతు భరోసా అందరికీ రెండు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు, అప్పుడు మొత్తం రైతులు 71,05,572మందికాగా, విడుదలైన నిధులు సుమారు రూ. 5,653కోట్లు.
వర్షాల కారణంగా వేదిక మార్పు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేశారు. ఆ సభను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించాలని సీఎం మంత్రులకు సూచించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ వేదిక నుంచే రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతి నిధులు, వ్యవసాయ అధికారులు సమీప రైతు వేదిక లకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 73.32 లక్షల మంది రైతులకు రైతుభరోసా నిధులను దశలవారీగా జమ చేస్తామని మంత్రి తెలిపా రు. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతులు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా వివరాలు అందిస్తే, వారికి కూడా రైతుభరోసా వర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


