ఇది చరిత్రాత్మక ఘట్టం: చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

International Arbitration Centre In Hyderabad - Sakshi

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ 

ట్రస్ట్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

ఈ కేంద్రం ఏర్పాటు నా చిరకాల స్వప్నం.. ఇంత త్వరగా సాకారమవుతుందనుకోలేదు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు శుభపరిణామం ఇకపై వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారం అవుతాయి హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ ట్రస్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ ఓ చరిత్రాత్మక ఘట్టం. ఈ కేంద్రం దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి నివాసంలో శుక్రవారం జరిగిన అంత ర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ ట్రస్ట్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమానికి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం నా చిరకాల స్వప్నం. ఆ స్వప్నం ఇంత త్వరగా సాకారమవుతుందని అనుకోలేదు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్‌లో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రతిపాదన తెలియజేశా. ఆయన వెంటనే స్పందించారు. మూడు నెలల్లోపే నా స్వప్నం సాకారం చేసేందుకు అడుగులు పడ్డాయి. ఇందుకు సీఎం కేసీఆర్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

ట్రస్ట్‌డీడ్‌పై జస్టిస్‌ రమణ, ట్రస్ట్‌ లైఫ్‌ మెంబర్లు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్, హైకోర్టు సీజే జస్టిస్‌ హిమాకోహ్లి, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోరు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు.

వివాదం లేని వాతావరణం...
‘‘పెట్టుబడిదారులు వివాదాలకు ఆస్కారం లేని వాతావరణాన్ని కోరుకుంటారు. ఏదైనా వివాదం వచ్చినా సత్వరం పరిష్కరించుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం దేశంలో అలాంటి వాతావరణం లేదు. వివాదాల పరిష్కారానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 2015లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని పెట్టుబడులు ఆహ్వానించేందుకు జపాన్, కొరియాకు పంపింది. ఆ బృందంలో నేనూ ఒకర్ని. ఆయా దేశాల్లో విస్తృతంగా పర్యటించి 8 ప్రదేశాల్లో పెట్టుబడిదారులతో చర్చలు జరిపాం.

మీ దేశంలో వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందని వారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడ్డాం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుతో వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారమవుతాయి. దీంతో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఈ కేంద్రాన్ని ప్రోత్సహించండి. తద్వారా హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

సంస్కరణలకు పీవీ బీజం వేశారు...
‘‘దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజం వేశారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆయన ప్రయత్నించగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ చట్టానికి రూపకల్పన జరిగింది. 1996లో ఆర్టిట్రేషన్‌ కన్సీలియేషన్‌ చట్టం అమల్లోకి వచ్చింది. 1926లో పారిస్‌లో మొదటి ఆర్బిట్రేషన్‌ కేంద్రం ప్రారంభమైంది.

ఇటీవల దుబాయ్‌లో కూడా ఓ కేంద్రం ప్రారంభమైంది. షామీర్‌పేటలోని నేషనల్‌ లా యూనివర్శిటీ (నల్సార్‌) సమీపంలో 2003లో 10 ఎకరాల భూమి, రూ. 25 కోట్లను ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రతివాదన ముందుకు వెళ్లలేదు. ఆ భూమి ఇప్పటికీ హైకోర్టు అధీనంలో ఉంది. దాన్ని వెనక్కు తీసుకొని ఫైనాన్స్‌ డిస్ట్రిక్‌ సమీపంలో ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు సూచిస్తున్నా. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

మరిన్ని పెట్టుబడులు వస్తాయి...
ఈ కేంద్రం ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రంలో న్యాయవ్యవస్థ నుంచే కాకుండా వివిధ రంగాల్లోని నిపుణులైన ఆర్బిట్రేటర్స్‌ ఉంటారని, ఈ కేంద్రం రాష్ట్రానికే కాకుండా దేశానికే మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ సంయుక్తంగా ప్రయత్నించి ఈ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో తెలుగువారైన ముగ్గురు న్యాయమూర్తులు కొలుగుదీరిన వేళ దేశంలోనే ఈ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అదృష్టమని, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ చేతుల మీదుగా త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని, ఈ సెంటర్‌ ఫలవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్‌ జగన్నాథరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top