వాయిదా వేద్దామా! 

Intermediate Examination In The Telangana Are Likely To Be Postponed - Sakshi

ఇంటర్‌ పరీక్షలపై అధికారుల తర్జనభర్జన 

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల వాయిదా నేపథ్యంలో పరిస్థితుల బేరీజు 

మరో 15 రోజుల్లోనే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు 

ఇప్పటికి ఆన్‌లైన్‌ బోధన అంతంతే...

మరోవైపు అదుపులోకి రాని కరోనా కేసులు..ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కేసుల వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఇక పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా వారికి మార్కులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలోనూ పరీక్షల నిర్వహణపై నేడో, రేపో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

నిర్వహణ ఇబ్బందికరమే... 
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరమేనన్న భావనలో అధికారులు ఉన్నారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ బోధన అంతంతగానే కొనసాగుతోంది. విద్యార్థులందరికి ఆన్‌లైన్‌ పాఠాలు అందడం లేదు. టీశాట్‌ వీడియో పాఠాల ప్రసారాన్ని విద్యార్థులంతా చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లోనూ పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ ఇబ్బందికరమేనన్న ఆలోచన అధికారుల్లో ఉంది.

షెడ్యూలు ప్రకారం మే 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలను, 2వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయా పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రోజు విడిచి రోజు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రతిరోజు 5 లక్షల మంది విద్యార్థులు వస్తారని, భౌతికదూరం పాటించడం కష్టమేనన్న భావన నెలకొంది. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించేప్పుడు, పరీక్ష కేంద్రాల్లోనూ ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ సమయంలో ఏర్పాటు చేసే 1,350 కేంద్రాలకు బదులు రెట్టింపు కేంద్రాలను ఏర్పాటు చేసినా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. 

కేంద్రమే వద్దనుకున్నపుడు రాష్ట్రంలో ఎలా? 
కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇప్పుడే పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావన విద్యాశాఖ వర్గాల్లో నెలకొంది. కేంద్ర ప్రభుత్వమే జూన్‌లో పరిస్థితి సమీక్షించి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించడం అవసరమా? అన్న భావన అధికారుల్లో నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నేడో రేపో తేలనుంది. ఇక రాష్ట్రంలో 260 సీబీఎస్‌ఈ స్కూళ్లు ఉండగా అందులో 15 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారందరికి పరీక్షలు రద్దయ్యాయి. 12వ తరగతి చదివే మరో 10 వేల మంది విద్యార్థులు జూన్‌ వరకు వేచి చూడాల్సిందే. 

టెన్త్‌ పరీక్షలపై వేచి చూద్దామా? 
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం మే 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంటే మరో నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకుంటుందా? కొన్ని రోజుల తరువాత కరోనా కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం పదో తరగతి పరీక్షలు అవసరమే లేదని, విద్యార్థులందరిని పాస్‌ చేస్తే సరిపోతుందన్న భావనలో ఉన్నాయి.      

జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరిగేనా?
ఈనెల 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ మూడో దఫా పరీక్షలపైనా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ పరీక్షలను షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తారా? లేదా? అన్నది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 

చదవండి: ఆదమరిస్తే అంతే! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top