విద్యార్థుల ఆందోళనబాట.. బోర్డు దోబూచులాట

Inter Board No Clarity On Inter First Year Reverification And Recounting - Sakshi

ఫస్టియర్‌లో ఫెయిలైనవాళ్ల విషయంలో ఎటూ తేల్చని ఇంటర్‌ బోర్డు

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ దరఖాస్తులపైనా స్పష్టత కరువు

బోర్డు జాప్యంతో విద్యార్థుల్లో ఆందోళన.. ఇప్పటికే నలుగురి బలవన్మరణం

అందరినీ పాస్‌ చేయాలని సర్కారుకు సిఫార్సు చేశామన్న బోర్డు అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డు దోబూచులాట రానురానూ వివాదాస్పదమవుతోంది. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థుల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు, నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారో కూడా స్పష్టతనివ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, రెండో సంవత్సరానికి సమర్థతను బేరీజు వేసుకోవ డానికే పరీక్షలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయ డంతో ఫెయిలైన విద్యార్థుల విషయంలో బోర్డు నిర్ణయమేంటని అయోమయం పెరుగుతోంది.

అందరినీ పాస్‌ చేయాలని తాము ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడం జాప్యమవు తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరినీ పాస్‌ చేయాలని రోజూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ఇప్పటికే 39 వేల రీ వెరిఫికేషన్‌ దరఖాస్తులు
ఇటీవలి ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో దాదాపు 2 లక్షల మందికిపైగా ఫెయిల్‌ అయ్యారు. వీరిలో 39,039 మంది రీ వెరిఫికేషన్‌ కోసం.. 4,200 మంది రీ కౌంటింగ్‌ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రీ వెరిఫికేషన్‌ దరఖాస్తుదారులకు వారి జవాబు పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. రీ కౌంటింగ్‌ అయితే మార్కులను మరోసారి లెక్కి స్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా అధ్యాప కులను నియమించాలి. కానీ ఇంకా ఈ దిశగా పని మొదలుకాలేదు. అందరినీ పాస్‌ చేయాలనే డిమాండ్‌ వస్తుండటంతోనే జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు అంటున్నాయి.

ఫస్టియర్‌పై నిర్ణయం రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీన్ని తీవ్రం చేసేందుకూ వ్యూహాలు రచిస్తున్నాయి.  కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంతాలకు ఆన్‌లైన్‌ విద్య అందలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవర్గాలకు చెందినవారే ఎక్కువ మంది ఫెయిలయ్యారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. దీంతో అలందరినీ పాస్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

బోర్డు కార్యాలయం వద్ద జగ్గారెడ్డి ధర్నా
ఇంటర్‌లో ఫెయిలైన 2.36 లక్షల మంది విద్యార్థులను తక్షణమే పాస్‌ చేయాలంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి గురువారం ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట 2 గంటలు ధర్నా చేశారు. విద్యార్థులు చనిపోతుంటే సర్కారు మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. ఆన్‌లైన్‌ క్లాసులే సరిగా జరగనప్పుడు, పేదలకు ఆ విద్య చేరనప్పుడు పరీక్షలెలా రాస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నేపథ్యంలో బోర్డు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top