
సాక్షి, హైదరాబాద్: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) అనే వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారి చికిత్స కోసం 8 వేల మంది దాతలు స్పందించారు. ఈ పాప చికిత్సలో ఉపయోగించే ‘జోల్జెన్స్మా’ఇంజెక్షన్ ఖరీదు రూ.14 కోట్లు కాగా...దాతల సాయంతో విజయవంతంగా చికిత్స పూర్తి చేశామని సికింద్రాబాద్ రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యుడు రమేశ్ కోనంకి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నగరానికి చెందిన వినీత్ చౌదరి దంపతులకు పది నెలల క్రితం చిన్నారి జన్మించింది. పుట్టిన తరువాత నాలుగు నెలలు గడిచినా కండరాల్లో సరైన కదలికలు లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు నిర్వ హించిన అనంతరం చిన్నారికి ఎస్‌ఎంఏ అనే వ్యాధి సోకిందని నిర్ధారించారు. సకాలంలో చికిత్స అందకపోతే రెండేళ్లకు మించి చిన్నారి బతకడం కష్టమని గుర్తించారు.
ఈ చికిత్సకు ఉపయోగించే జోల్జెన్స్మా ఒక డోసు ఇంజెక్షన్ ఖరీదు రూ.14 కోట్లు ఉంటుందని చెప్పారు. దీనికోసం క్రౌడ్ ఫండింగ్‌ను అనుసరించగా.. సుమారు 8 వేల మంది సాయం చేశారని డాక్టర్ రమేశ్ తెలిపారు. దీంతో సికింద్రాబాద్ రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చిన్నారికి వారం రోజుల క్రితం విజయవంతంగా చికిత్స చేశామని, ఇప్పుడు పాప పూర్తిగా కోలుకుందని తెలిపారు. చిన్నారి తండ్రి వినీత్ చౌదరి మాట్లాడుతూ చికిత్సకు సాయం చేసిన ఎంతో మంది దాతలు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.