ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ
మరో వారం రోజుల్లో ఉత్పత్తి పూర్తి
నవంబరు 19న పంపిణీకి ఏర్పాట్లు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హనుమకొండ జిల్లాలోనూ ఆర్డర్లు ఇచ్చారు. కానీ సిరిసిల్లలో మెజారిటీ పవర్‌లూమ్స్ ఉండడంతో ఇక్కడే ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్‌లోనూ మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు.
ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్ (నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్ స్టాక్‌గా ఉంచడానికి రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేశారు. సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులకు 90 శాతం అరువుపై నూలు (దారం)ను సరఫరా చేశారు. దీంతో సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులపై పెట్టుబడి భారం తగ్గింది. చీరల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతోంది. నిజానికి బతుకమ్మ పండుగ నాటికే చీరల ఉత్పత్తి పూర్తి కావాల్సి ఉండగా.. ఆర్డర్లు ఆలస్యంగా ఇవ్వడంతో ఉత్పత్తి ఆలస్యమైంది.
ఇందిరమ్మ జయంతి సందర్భంగా: రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఏటా మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలను ఇస్తామని ప్రకటించారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి చీర ఖరీదు రూ.480గా నిర్ణయించారు. నవంబరు 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని స్వశక్తి సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని భావిస్తున్నారు.
సిరిసిల్లలోని బీవైనగర్‌లో పవర్‌లూమ్స్ (మరమగ్గాల)పై ఇందిరా మహిళా శక్తి చీరల బట్టను నేస్తున్న ఇతని పేరు ఐతం రాజు. 60 ఏళ్లు దాటిన మహిళలు కట్టుకునేందుకు వీలుగా గోచీ చీరలు (తొమ్మిది మీటర్ల పొడువు) ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ చీరలను జౌళిశాఖ అధికారులు డిజైన్ చేసి ఇవ్వడంతో సాంచాలపై ఉత్పత్తి అవుతున్నాయి. ఆరునెలలుగా చీరల ఉత్పత్తితో నేత కార్మికులకు చేతి నిండా పని ఉండగా..ఇప్పుడు చీరల ఉత్పత్తి చివరి దశకు చేరింది.
ఇతను బీవైనగర్‌కు చెందిన వేముల భూమయ్య. నెలాంతా పని చేస్తే రూ.20వేల వరకు కూలి వస్తుంది. అదే ప్రభుత్వ ఆర్డర్ కాకుండా సాధారణ పాలిస్టర్ బట్ట ఉత్పత్తి చేస్తే నెలకు రూ.10 వేలు వస్తాయి. ఇందిరా మహిళా శక్తి చీరల బట్టను ప్రభుత్వం ఆర్డర్ చేయడంతో నేతన్నలకు మెరుగైన కూలి లభిస్తుంది.
వారం రోజుల్లో ఉత్పత్తి పూర్తి
సిరిసిల్లలో చీరల బట్ట ఉత్పత్తి, సేకరణ చివరిదశకు చేరింది. నేత కార్మికులు రేయింబవళ్లు శ్రమించి బట్టను ఉత్పత్తి చేశారు. ఇంకా కొన్ని సాంచాలపై ఉత్పత్తి అవుతున్నాయి. వారం రోజుల్లో ఉత్పత్తి పూర్తవుతుంది.
– రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల


