
సాక్షి, హైదరాబాద్: అవిరళ కృషి, అత్యాధునిక సాంకేతికతతో భారత్ కీర్తి విశ్వవ్యాప్తమవుతోందని భార త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాలా పురోగమిస్తోందని అన్నారు. దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది.
కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విలువలతో జన్మించిన రైతుబిడ్డ కొండా మాధవరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. భారత్ అమృత్ కాల్ జరుపుకుంటున్న వేళ ఆయనకు సముచిత స్థానం ఇవ్వడం అభినందనీయమన్నారు.
భారత్ వైపు ప్రపంచం చూపు
యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. జీ–20 తర్వాత మనం ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగామని అన్నారు. ఈ సదస్సు ద్వారా భారత్ శక్తియుక్తులు ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యాయని చెప్పారు. సాంకేతిక విప్లవం సవాళ్ళతో పాటు కొత్త అవకాశాలను కల్పిస్తోందని, ఈ రంగంలో దూసుకెళ్ళేందుకు భారత్ చేసే ప్రయత్నాలన్నీ ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేస్తున్నాయని వివరించారు.
ఇ–కోర్టుల ఏర్పాటు, పారదర్శక న్యాయ విధానం, డిజిటలైజేషన్, మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం, పెండింగ్ కేసులు తగ్గించడంపై శ్రద్ధ.. న్యాయ వ్యవస్థలో సంస్కరణలుగా ఆయన పేర్కొన్నారు. సొంత భాషలోనే తీర్పులివ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు. కొద్ది రోజుల క్రితమే చట్టసభల ఆమోదం పొందిన క్రిమినల్ కోడ్ బిల్లులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆయన తీర్పులు నేటికీ ఆదర్శం: తమిళిసై
న్యాయమూర్తిగా కొండా మాధవరెడ్డి ఇచ్చిన తీర్పులు నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఇచ్చి న తీర్పులు ఇప్పటికీ న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగానే ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి పాల్గొన్నారు.