మనకు భారత్‌ రైస్‌ భాగ్యం లేదా? | Sakshi
Sakshi News home page

మనకు భారత్‌ రైస్‌ భాగ్యం లేదా?

Published Wed, Feb 21 2024 4:54 AM

India rice sales from 6th of this month across the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరతో దేశవ్యాప్తంగా అవసరమైన వారందరికీ నాణ్యమైన బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బృహత్తర పథకం రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ ధరలు అదుపులోకి రాకపోవడంతో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది.

భారత్‌ రైస్‌ పేరుతో ఈ బియ్యం అమ్మకాలను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేషనల్‌ అగ్రికల్చర్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌), నేషనల్‌ కో ఆపరేటివ్‌ కన్సూమర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ రిటైల్‌ కేంద్రాలతో పాటు మొబైల్‌ అవుట్‌లెట్‌లలో కూడా భారత్‌ రైస్‌ విక్రయాలను ప్రారంభించారు.

ఆమెజాన్, జియో మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌ ద్వారా కూడా 5 కిలోలు, 10 కిలోల భారత్‌ రైస్‌ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.29 కిలోల బియ్యం బ్యాగులు విక్రయిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్‌ రైస్‌ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. 

కేటాయింపులు జరిపినప్పటికీ... 
ఫిబ్రవరి 6వ తేదీ నాటికే రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరపాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు నాఫెడ్‌ ప్రాంతీయ కార్యాలయానికి సమాచారం అందించింది. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరించి 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో నింపి విక్రయించే ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు తొలి విడతగా నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌కు ఒక్కో సంస్థకు 2 వేల టన్నుల చొప్పున బియ్యం కేటాయించింది. అయితే ఇప్పటివరకు బియ్యం బ్యాగ్‌లు రిటైల్‌ అవుట్‌లెట్లకు చేరలేదు. 

డిపోలలోని బియ్యం ఇతర రాష్ట్రాలకే! 
భారత్‌ రైస్‌ బ్యాగ్‌లకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) నాఫెడ్‌కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్‌కు అవసరమైన మేర బియ్యాన్ని ఎఫ్‌సీఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలోని 52 ఎఫ్‌సీఐ డిపోలలో సుమారు 5లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, ఆ బియ్యం మొత్తం సెంట్రల్‌ పూల్‌ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో భారత్‌ రైస్‌ కోసం నాఫెడ్‌కు ఎఫ్‌సీఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోవాలని ఎఫ్‌సీఐ వర్గాలు చెపుతున్నాయి.

బియ్యం రాలేదు రిటైల్‌ అమ్మకాల కోసం
రైస్‌ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్‌ రైస్‌ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్‌ ఉంది. రోజూ ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్‌ ద్వారా ఈ బ్యాగులు రావలసి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయించాం.- రమణమూర్తి, ఆర్‌.ఎం,కేంద్రీయ భండార్‌ 

Advertisement
 
Advertisement