- ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సర్కారు దగా
- ఫిఫో విధానానికి తిలోదకాలిచ్చి బడా కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాల చెల్లింపులు
- చట్టప్రకారం చిన్న మొత్తాలు పొందాల్సిన దళితుల నోట్లో మట్టి
- మంత్రి కుటుంబానికి చెందిన టీజీవీ సార్క్ కంపెనీకి రూ.36.68 కోట్లు చెల్లింపు
- మోహన్ స్పిన్‌టెక్స్‌కు రూ.60.50 కోట్లు.. అమరరాజా గ్రూపునకు రూ.15.60 కోట్లు..
- లాభాల్లో నడిచే కియా మోటార్స్‌కు ఏకంగా రూ.175 కోట్లు..
- టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కంపెనీకి రూ.3.47 కోట్లు..
- కానీ, రెండువేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చిల్లిగవ్వ విదల్చని చంద్రబాబు సర్కారు
- ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్న దళిత పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: మంత్రిగారి కంపెనీకి సబ్సిడీ ఇవ్వడానికి రూ.కోట్లుంటాయి. కానీ, ప్రభుత్వం సాయం చేస్తుందని నమ్మి చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే దళితులకు ఇవ్వడానికి పైసా ఉండదు. పేదలకు అందులోనూ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా పదవిని, పార్టీని చూసి పంచేసే దుర్మార్గం చరిత్రలో ఇదే మొదటిసారి. ‘మా రాయితీలు మాకు ఇప్పించండి మహాప్రభో’ అంటూ వారంరోజులుగా గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా గత నవంబరులో ఏపీఐఐసీ కార్యాలయం ముందు దళిత కుటుంబాలు ధర్నా చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు.
పైగా.. ‘ఖజానాలో డబ్బుల్లేవు, ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఈ టెంట్ కూడా పీకించేస్తా’మంటూ మంత్రిగారి బెదిరింపులు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? ఇదేనా ఈ ప్రభుత్వానికి దళితుల మీద ఉన్న ప్రేమ? కాళ్లరిగేలా తిరుగుతున్న దళిత పారిశ్రామికవేత్తలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా డబ్బులొచ్చినప్పుడు ఇస్తామంటూ ఒకపక్క పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చెబుతూనే తన కుటుంబానికి చెందిన కంపెనీలకు ఏకంగా రూ.36.68 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు విడుదల చేసుకోవడంపై దళిత పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు.
అధికారంలోకి రాగానే పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించడంతోపాటు, సకాలంలో ఎప్పటికప్పుడు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిన బాబు సర్కారు.. అధికారం చేపట్టిన తర్వాత బడుగులను నిండా ముంచేసింది. 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలను ఉల్లంఘించి పారిశ్రామికవేత్తలపై రాజకీయముద్ర వేస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయడంపై వీరు మండిపడుతున్నారు.
నిధులన్నీ వాళ్ల వాళ్లకే..
పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద సుమారు రూ.12,000 కోట్లు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నవంబరులో సీఐఐ పెట్టుబడుల సదస్సు ముందు మొక్కుబడిగా రూ.1,174.76 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. వాస్తవంగా 17,116 క్లెయింలకు సంబంధించి రూ.2,194.30 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేయడానికి పరిపాలన అనుమతి తీసుకున్నా కేవలం రూ.1,174.76 కోట్లతోనే సరిపెట్టేశారు. ఇందులో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారు.
ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఫిఫో) విధానంలో ఇన్నాళ్లు ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్న పరిశ్రమల శాఖ.. తొలిసారిగా ఆ నిబంధనలను ఉల్లంఘించింది. చంద్రబాబు సర్కారు విడుదల చేసిన ప్రోత్సాహకాల జాబితా పరిశీలిస్తే ఎన్ని అవకతవకలు జరిగాయో తెలుస్తుంది. అప్పుల్లో కూరుకుపోయిన దళిత పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన చిన్న మొత్తాలను చెల్లించకుండా భారీ లాభాలు ఆర్జించే కంపెనీల నుంచి లంచాలు తీసుకుని వారికి చెల్లించారని బాధిత పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఉదా..
» మంత్రి టీజీ భరత్ కంపెనీకి రూ.36.68 కోట్లు..
» టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా గ్రూపులకు రూ.15.60 కోట్లు..
» అదే పార్టీకి చెందిన మరో ఎంపీ బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌కు రూ.3.47 కోట్లు..
» అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవంతీ ఫీడ్స్‌కు రూ.2.53 కోట్లు..
» వల్లభనేని సుధాకర్ చౌదరికి చెందిన మోహన్ స్పిన్‌టెక్స్‌కు రూ.60.50 కోట్లు చెల్లించేశారు.
» ఇక కొరియాకు చెందిన కియా మోటార్స్‌కు అయితే ఏకంగా రూ.175 కోట్లు చెల్లించారు.. ఈ విధంగా మొత్తం జాబితా పరిశీలిస్తే తనకు కావాల్సిన వారికి బాబు సర్కారు ఏ విధంగా నిధులు అడ్డుగోలుగా చెల్లించిందో అర్ధంచేసుకోవచ్చు.
8,000 మంది దళిత పారిశ్రామికవేత్తలు బజారుపాలు..
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆశతో కారు, జేసీబీ, బస్సులు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్న దళితుల వెన్నును చంద్రబాబు సర్కారు విరిచేసింది. సుమారు 8,000 మంది దళిత పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలను చెల్లించకుండా వారిని బజారుకు లాగేసింది. ఇందులో కనీసం రెండువేల మందికి ఇంతవరకు ఒక్కపైసా కూడా చెల్లించలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు.
2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు చెందిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు ముందుగా చెల్లించాల్సి ఉంది. కానీ, వీరికి కాకుండా అస్మదీయులకు ప్రస్తుత ఏడాది ప్రోత్సాహకాలను సైతం విడుదల చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధంచేసుకోవచ్చు. ఉదా.. శ్రీ పాలెతమ్మె తల్లి ట్రాన్స్‌పోర్టుకు 2025–26కు సంబంధించి రూ.1,44,000 చెల్లించారు.
జ్యోతీ ఇండస్ట్రీస్‌కు రూ.36,566, ఆరాధ్య ఇండస్ట్రీస్‌కు రూ.17,71,137 చెల్లించడానికి డబ్బులు వస్తే అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన తారేకేశ్వర స్పిన్నింగ్, సినర్జీ రెమిడీస్, ఎన్‌జీ ఫెర్టిలైజర్స్, అమృతవర్షిణి గ్రానైట్, సునీతా పాలిమర్స్ వంటి కంపెనీలకు డబ్బులు లేవంటూ ఆపేశారు.
నిర్దాక్షిణ్యంగా జైలుకు..
పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాం.. అప్పులు పుట్టడంలేదు, ఈఎంఐలు కట్టలేకపోతున్నామంటూ దళిత పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ ఎదుటే ధర్నా చేస్తుంటే బాబు సర్కారు కనికరం చూపించకపోగా నిర్దాక్షిణ్యంగా వీరిని జెలుకు పంపుతోంది.
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడం అటుంచితే.. బాబు సర్కారు ఇంటికో భిక్షగాడిని తయారుచేస్తోందంటూ వీరు ఆరోపిస్తున్నారు. దళితులకు ఇవ్వడానికి డబ్బులుండవుగానీ, ఎన్నారై పారిశ్రామికవేత్తలకు రూ.50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేస్తున్నానంటూ చంద్రబాబు దావోస్‌లో చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.


