‘పామాయిల్‌ గెల’.. గగ్గోలు | Import duty reduction for oil palm farmers in the state | Sakshi
Sakshi News home page

‘పామాయిల్‌ గెల’.. గగ్గోలు

Jun 18 2025 12:37 AM | Updated on Jun 18 2025 12:37 AM

 Import duty reduction for oil palm farmers in the state

ఆయిల్‌పామ్‌ రైతులకు తాకిన సుంకం తగ్గింపు దెబ్బ

మే నెలాఖరున రూ. 20,058గా ఉన్న టన్ను గెలల ధర ప్రస్తుతం రూ. 18,748

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆయిల్‌పామ్‌ రైతులకు దిగుమతి సుంకం తగ్గింపు దెబ్బ తగిలింది. క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ (సీపీఓ) తోపాటు క్రూడ్‌ సన్‌ ఫ్లవర్, క్రూడ్‌ సోయా ఆయిల్‌లపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల 31న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మే 31 నాటికి ఒక టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.20,058 ఉండగా, ఇప్పుడు ఆ ధర రూ.18,748కి తగ్గింది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతి సుంకాన్ని 10 శాతం మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించగా, పామాయిల్‌ గెలల ధరపై కూడా సుమారు 10 శాతం వరకు ప్రభావం చూపింది. విదేశాల నుంచి క్రూడ్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ దిగుమతి పెరగడంతోనే ఆయిల్‌ పామ్‌ గెలల ధర పడిపోయిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. 

తగ్గని వంటనూనెల ధర
ఆయిల్‌ పామ్‌ గెలల ధర తగ్గినా, వంట నూనెల రిటైల్‌ ధరలు తగ్గకపోవడం గమనార్హం. పామాయిల్, సన్‌ఫ్లవర్, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ లీటర్‌ సాచెట్‌ల ధరల్లో రూపాయి వ్యత్యాసం కూడా లేదు. 

»  మే 31వ తేదీన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర లీటర్‌కు రూ.137.40 గా ఉంటే ఈనెల 16వ తేదీ నాటికి ఆ ధర రూ.136.10గా ఉంది. 
»  పామాయిల్‌ రిటైల్‌ ధర గత నెల 31న రూ.115.20 ఉండగా, 13వ తేదీ వరకు సుమారు రూ. 5 తగ్గి రూ.110.70కి చేరగా, 16న ఒక్కసారిగా రూ. 5 పెరిగి రూ. 116.10కి చేరుకుంది. 

పామాయిల్‌ గెలల ధరలు తగ్గినా, సాధారణ వినియోగదారుడికి పామాయిల్‌ ఇతర తిండి నూనెలు అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగించే విషయమే. నూనెల ధరలు, గెలల ధరలతో సంబంధం లేకుండా రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి కృషి చేస్తుందని ఆయిల్‌ఫెడ్‌ ఎండీ శంకరయ్య ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement