పటాన్‌చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు! | HYDRA Demolish Constructions At Sanga Reddy District | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!

Jan 31 2025 10:51 AM | Updated on Jan 31 2025 11:12 AM

HYDRA Demolish Constructions At Sanga Reddy District

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్‌ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా  అమీన్‌పూర్‌లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్‌పూర్‌ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది  కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.

స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులు
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్‌ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement