ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇంతే.. తనిఖీలెక్కడ?

Hyderabad Whenever there are accidents No Proper Checking - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇకపై ఇలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, మంత్రులు, అధికారులు ప్రకటించడం పరిపాటిగా మారింది. అంతకుమించి ఆ తర్వాత చర్యలుండటం లేవు. భవనాలు కూలినా అంతే. అగ్నిప్రమాదాలు జరిగినా అదే వైఖరి. తాజాగా సికింద్రాబాద్‌ మినిస్టర్‌రోడ్‌లో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జనావాసాల మధ్య అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన గోడౌన్‌లు, తదితరమైన వాటిపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామన్నారు. గత సంవత్సరం బోయగోడలో స్క్రాప్‌గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించినప్పుడు సైతం ఇలాంటి ప్రకటనలే చేశారు.

అప్పటినుంచి ఇప్పటి వరకు ఏంచేశారో ఎన్ని భవనాలు తనిఖీలు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో జీహెచ్‌ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం వెల్లడించలేదు. అప్పట్లో  హోంమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఏమైందో తెలియదు. గోడౌన్లు, షోరూమ్‌లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పబ్‌ల దాకా అదే పరిస్థితి వేటికీ నిబంధనల మేరకు సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు అసలే ఉండవు. గత సంవత్సరమే ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లోనూ జరిగిన అగ్ని ప్రమాదాలు నగర ప్రజలింకా మరచిపోలేదు. 

చర్యలేవీ?  
జీహెచ్‌ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అగ్నిప్రమాదాలు జరిగితే ఎక్కువ మందికి అపాయం జరిగే బార్లు, పబ్‌ల వంటివాటిపై తొలుత చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వాటి తర్వాత హోటళ్లు, హాస్పిటళ్లపై చర్యలుంటాయని హెచ్చరించింది. కానీ ఇప్పటి వరకు ఒక్కదానిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నగరంలో, చుట్టుపక్కల దాదాపు 20వేలకు పైగా గోడౌన్లే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కనీసం పదిశాతం భవనాలకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు.

గతంలో నగరంలోని  భవనాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావించిన జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం– పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులను బృందాలుగా  ఏర్పాటుచేసి, తనిఖీలు నిర్వహించి, ఫైర్‌సేఫ్టీ లేని భవనాలపై  చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలు కాలేదు. కనీసం ఫైర్‌సేఫ్టీ విభాగమైనా చర్యలు తీసుకుందా అంటే అదీ లేదు. జీహెచ్‌ఎంసీలో  ఫైర్‌సేఫ్టీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ అధికారాలు ఉన్న విభాగం కూడా.. ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top