TSRTC Student Buss Pass Charges: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?

సాక్షి, హైదరాబాద్: సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా డీజిల్ సెస్, టిక్కెట్ ధరల రౌండాఫ్ నెపంతో ఇప్పటికే నగరంలో చార్జీల మోత మోగిస్తున్న ఆర్టీసీ..తాజాగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. బస్‌పాస్ చార్జీలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను ఇంచుమించు రెట్టింపు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.
నగరంలో సాధారణ నెలవారీ బస్‌పాస్‌లతో (జీబీటీ)పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు, సాధారణ క్వార్టర్లీ పాస్‌లు, గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్‌లను ఎక్కువ మంది విద్యార్థులు వినియోగిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి కాలేజీ వరకు వెళ్లి వచ్చేందుకు రూట్ పాస్‌లకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది. ఇలా వివిధ రకాల పాస్‌లను వినియోగిస్తున్న విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా.
ఈ విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ప్రతి నెలా ఆర్టీసీకి ప్రస్తుతం రూ.8.5 కోట్ల వరకు చెల్లిస్తుండగా తాజా పెంపుతో మరో రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ప్రస్తుతం సాధారణ నెల వారీ పాస్ రూ.165 ఉండగా, తాజాగా రూ.300 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే క్వార్టర్లీ పాస్ రూ.495 నుంచి రూ.650 వరకు పెరగవచ్చునని అంచనా. ఏ బస్‌పాస్‌పైన ఎంత వరకు చార్జీలు పెరిగాయనే అంశాన్ని బుధవారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్టీసీ స్పష్టం చేయకపోవడం గమనార్హం.
చదవండి: (సదరం స్కాంపై ఏసీబీ కేసు!)