‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్‌.. సదరం స్కాంపై ఏసీబీ కేసు! | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్‌.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!

Published Thu, Jun 9 2022 5:54 AM

ACB case filed on karimnagar Sadaram certificates scam - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్‌ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ‘దివ్యంగా దోచేస్తున్నారు’శీర్షికన తొలిసారిగా ఈ కుంభకోణాన్ని ‘సాక్షి’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సదరం సర్టిఫికెట్లు తీసుకున్న పలువురు అనర్హులు ప్రతినెలా దివ్యాంగ పింఛన్లు, బస్, రైలు పాసుల్లో రాయితీలు, ఏటా ఆదాయపు పన్ను రాయితీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు.  

జిల్లా సివిల్‌ ఆసుపత్రికి నోటీసులు!
రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని చేకూరుస్తున్న ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు ఇప్పటికే డీఆర్‌డీఏ అధికారులకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను పంపారు. దానికి వారి నుంచి సమాధానం రాగా తాజాగా కరీంనగర్‌ జిల్లా సివిల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం నోటీసులు పంపించారు. ఇక్కడనుంచి వచ్చే సమాధానాల ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో జారీ అయిన పలు అనుమానాస్పద సర్టిఫికెట్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు.

అసలేం జరిగింది..?
కరీంనగర్‌లోని జిల్లా సివిల్‌ ఆస్పత్రి– కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏలోని కొందరు అధికారులు కలిసి అనర్హులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే తతంగానికి తెరలేపారు. వీరంతా పలు మండలాల్లో ఏజెంట్లను, తమకు అనుకూలమైన వైద్యులతో ముందే మాట్లాడుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారు అడిగినంత వైకల్య శాతాన్ని వేసి పంపేవారు. ఇందుకోసం సదరం వ్య వహారాలు చూసే ఇద్దరు డీఆర్‌డీఏ ఉద్యోగుల (శ్రీనివా స్, కిశోర్‌)ను పెట్టుకున్నారు. వాస్తవానికి వీరిని 2019 లోనే డీఆర్‌డీఏ తొలగించగా..ఈ వ్యవహారంలో ఉన్న పూర్వానుభవంతో ఎలాంటి నియామక పత్రాలు లేకున్నా..26 నెలలపాటు శ్రీనివాస్, కిశోర్‌తో సివిల్‌ ఆసుపత్రిలో దందా చేయించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement