ఓఎల్‌ఎక్స్‌లో మోసం.. నిందితుల కోసం రాజస్తాన్‌కు

Hyderabad Police Arrest Cyber Criminals Gang In Rajasthan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ–యాడ్స్‌ యాప్‌ ఓఎల్‌ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్‌ పోలీసులు రాజస్తాన్‌కు వెళ్లారు. స్థానిక భరత్‌పూర్‌ జిల్లాలోని కళ్యాణ్‌పురి, చౌ వేరా గ్రామాల్లో ఉన్న నిందితుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ముఠా ఓఎల్‌ఎక్స్‌లో వాహనాల ఫొటోలు పెట్టి, తక్కువ ధరకే అమ్ముతామంటూ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఎంతోమంది బాధితులు మోసానికి బలైపోయారు. ఈ క్రమంలో నేరగాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు, వారిని వెదుక్కుంటూ రాజస్తాన్‌కు వెళ్లారు. పది మంది సభ్యులు గల ఈ బృందానికి భరత్‌పూర్‌ జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేసే వంద మంది స్థానిక పోలీసులు కూడా జతకలిశారు.(చదవండి: ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్‌ కార్డులు)

వీరంతా కలిసి, కళ్యాణ్‌పురి, చౌ వేరా గ్రామాల్లో తలదాచుకున్న నిందితుల ఇళ్లపై రైడ్‌ చేశారు. విషయం తెలుసుకున్న నేరగాళ్ల ముఠా, వారి కుటుంబ సభ్యులు పోలీసులపై ఎదురుదాడికి దిగి,  వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో, అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బృందాలు, వాజిత్ ఖాన్, సాహిల్, సత్యవీర్ సింగ్, మోహన్ సింగ్ ఇర్ఫాన్, రాహుల్, అజరుద్దీన్, తారీఫ్ ఖాన్, ఉమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల క్రితం 8 మందిని అరెస్టు చేయగా, నేడు 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top