ఆహారం..విషపూరితం!

Hyderabad: Over Chemicals And Pesticides In Essential Goods - Sakshi

నిత్యావసరాల్లో పెస్టిసైడ్స్‌ ఆనవాళ్లు

ఆకుకూరలు..పండ్లు, కూరగాయలు, పప్పులు, సుగంధద్రవ్యాలనూ వదలని వైనం

రసాయనాలు, క్రిమిసంహారకాలతో అనారోగ్య సమస్యలు

ఆర్గానిక్‌ స్టోర్లలోని వస్తువుల్లోనూ అదే తీరు.. 

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌

 తాజా అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విజృంభణ ఒకవైపు..నిత్యం ఆహారంలో వినియోగించే నిత్యావసరాల్లోనూ పెస్టిసైడ్స్‌(క్రిమి సంహారకాలు) ఆనవాళ్లు మరోవైపు గ్రేటర్‌ సిటీజన్లను బెంబేలెత్తిస్తున్నాయి. రోజువారీగా వినియోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమిసంహారక ఆనవాళ్లు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరం పరిధిలో బహిరంగ మార్కెట్లు, దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తంగా సుమారు 30 శాతం మేర పెస్టిసైడ్స్‌ ఆనవాళ్లు బయటపడడం గమనార్హం. మరోవైపు ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహారపదార్థాలను విక్రయిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్‌ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ అనవాళ్లుండడం గమనార్హం.

ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు వెలుగుచూడడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (హైదరాబాద్‌) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. చివరకు కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఉనికి ఉండడం గమనార్హం. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

క్రిమిసంహారకాల ఆనవాళ్లిలా.. 
►క్రిమిసంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీస్టార్భిన్, కార్భన్‌డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్‌ తదితర క్రిమిసంహారక ఆనవాళ్లు బయటపడ్డాయి.  
► ఇవన్నీ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన పరిమితులకు మించి ఉండడం గమనార్హం.  
► ఎసిఫేట్, లిండేన్‌ వంటి క్రిమిసంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది.  
ముప్పు ఇలా... 
►దేశంలో సరాసరిన 10 శాతం మధుమేహ బాధితులుండగా..హైదరాబాద్‌ నగరంలో సుమారు 16 నుంచి 20 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దేశంలో గ్రేటర్‌ సిటీ డయాబెటిక్‌ క్యాపిటల్‌గా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 
►ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్లపాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  
► కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహంలోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని..పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతాయని స్పష్టం చేశారు.  
► బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేసిన కూరగాయలను తొలుత ఉప్పునీళ్లతో బాగా కడిగి ఆ తర్వాత..బాగా ఉడికించి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: 
సినారెకు సీఎం కేసీఆర్‌ నివాళి
వచ్చేనెల 25, 26వ తేదీల్లో బోనాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top