Hyderabad: మెట్రో స్టేషన్‌లో ‘ఆధార్‌’ కేంద్రం

Hyderabad News: Aadhar Centers in Metro Station, 27 Basti Dawakhanas Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు మెట్రో స్టేషన్‌లలో ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి మూసారాంబాగ్‌ మెట్రోస్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రానికి సిటీజన్ల నుంచి వచ్చే ఆదరణను బట్టి మరిన్ని స్టేషన్లలో ఆధార్, మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నాయి.  

త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు 
నగరంలో త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 256 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కాగా, త్వరలో మరో 27 ఏర్పాటు చేసేందుకు ఆయా బస్తీల్లోని కమ్యూనిటీహాళ్లు, వార్డు కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. డివిజన్‌కు రెండు వంతున జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో   300 బస్తీ దవాఖానాలు, అవసరాన్ని బట్టి మరో యాభై అదనంగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపు 
ఖైరతాబాద్‌ రాజ్‌దూత్‌ చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసుకున్న వివిధ ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం తొలగించారు. చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌ ఆక్రమణల నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మరుతున్నందున జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–17 ఉప కమిషనర్‌ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. చౌరస్తాలోని హోటల్‌ యజ్ఞేష్‌ విరాట్‌ హోటల్‌ ముందు ఉన్న ఆక్రమణలతో పాటు రోడ్డు మీదకు ఏర్పాటు చేసిన షాపులను, బండీలను తొలగించారు. జేసీబీ ఇతర వాహనాలతో మూడు గంటలపాటు తొలగింపు కార్యక్రమం జరిగింది. చౌరస్తాలో మరో వైపు ట్రాన్స్‌ఫార్మర్‌ను అనుకొని ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం అధికారులు తొలగించారు.  (చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది)

ఎల్‌బీనగర్‌లో భారీగా పెరిగిన ఓటర్లు! 
ఎల్‌బీనగర్‌లో ఓటర్ల సంఖ్య 5,57,081కి చేరింది. పురుష ఓటర్లు 2,91,749 కాగా.. మహిళా ఓటర్లు 2,65,229 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ 103 మంది ఉన్నట్టు 2022లో విడుదల చేసిన తుది జాబితాలో పేర్కొన్నారు.గ్రేటర్‌ పరిధిలో ఎల్‌బీనగర్‌ 3వ స్థానంలో ఉంది. గతంలో ఎల్‌బీనగర్‌ ఓటర్లు 5,24,577మంది ఉండగా, ఇందులో పురుషులు 2,74.830 కాగా.. మహిళలు 2,49,653 మంది ఇతరులు 94లు ఉన్నారు. గతంలో కంటే సుమారు 32,504 మంది కొత్తగా యువ ఓటర్లు పెరిగినట్టు తెలుస్తోంది.

గతంలో పురుష ఓటర్లు 274830మంది ఉండా ప్రస్తుతం 2,91,749 మంది ఉన్నారు. కొత్తగా 16,919 మంది, మహిళా ఓటర్లు గతంలో 2.49653 మంది ఉండగా, ప్రస్తుతం 265229 మంది ఉన్నారు. కొత్తగా 15,576 మంది ఓటర్లు పెరిగారు. ఇక ఇతరులు గతంలో 94 ఉంటే... ప్రస్తుతం 103కి చేరగా కొత్తగా 9మంది పెరిగారు. మొత్తానికి 2022లో ప్రకటించిన తుది జాబితాలో భారీగా ఓటర్లు పెరిగారు. (చదవండి: నుమాయిష్‌కు వైరస్‌ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top