
ఎల్ అండ్ టీ నుంచి ప్రాజెక్టు తొలిదశ స్వాదీనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
రూ. 13 వేల కోట్ల ఆ సంస్థ రుణ భారాన్ని మోసేందుకు అంగీకారం
మెట్రోరైల్ లిమిటెడ్‌లో ఈక్విటీ కింద రూ. 2 వేల కోట్ల చెల్లింపునకూ ఓకే
సీఎం రేవంత్ సమక్షంలో ఆ సంస్థ చైర్మన్‌తో భేటీలో ఏకాభిప్రాయం
రవాణా కార్యకలాపాల నిర్వహణ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపిన ఎల్ అండ్ టీ సీఎండీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు తొలి దశను ఎల్ అండ్ టీ గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 13 వేల కోట్ల రుణ భారాన్ని మోసేందుకు ముందుకొచ్చింది. అలాగే ఎల్ అండ్ టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్‌లో ఆ సంస్థకు ఉన్న ఈక్విటీలో రూ. 2 వేల కోట్లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద చెల్లించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వి. సుబ్రమణ్యన్ మధ్య జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2024 నవంబర్ నుంచి ఈ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది.
మెట్రో విస్తరణ వేళ..
మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఎల్ అండ్ టీ యాజమాన్యం మాత్రం మెట్రో నిర్వహణ భారం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో రెండో దశలో భాగం కాబోమని.. తొలి దశ నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గత నెలలోనే ప్రకటించింది. ఇదే విషయాన్ని సీఎంకు తాజా భేటీలో పునరుద్ఘాటించింది. ‘మెట్రో’ను నడిపించడం తమ వల్ల కాదని.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే రెండో దశలోని 2ఏ, 2 బీ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడం సాధ్యం కాదని ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్.వి. సుబ్రమణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్పష్టం చేశారు.
అయితే కనీసం మొదటి దశ, రెండో దశ మధ్య ఆపరేషనల్ ఇంటిగ్రేషన్, రెవెన్యూ, కాస్ట్ షేరింగ్ కోసం స్పష్టమైన ఒప్పందమైనా కుదుర్చుకోవాలని సీఎం కోరినప్పటికీ అందుకు ఎల్ అండ్ టీ సీఎండీ ససేమిరా అన్నారు. తాము పూర్తిగా రవాణా కార్యకలాపాల నిర్వహణ రంగం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నందున కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు చేసుకోవట్లేదని ఎస్.వి. సుబ్రమణ్యన్ తేల్చిచెప్పారు. తమ సంస్థకు ఉన్న అప్పులు, ఈక్విటీ చెల్లిస్తే తొలిదశ ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని ప్రతిపాదించారు.
2022 జూన్ 7న కుదుర్చుకున్న అదనపు రాయితీ ఒప్పందం ప్రకారం రూ. 3 వేల కోట్లు వడ్డీరహిత రుణంగా ప్రభుత్వం ఇస్తామన్న మొత్తంలో ఇంకా రూ. 2,100 కోట్లు అందాల్సి ఉందన్నారు. అలాగే రూ. 5,900 కోట్ల ఈక్విటీ విలువ కింద చెల్లించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో తొలిదశ ప్రాజెక్టును పూర్తిగా తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ఆదేశించారు.
ఈ సమావేశంలో పట్టణ రవాణా సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంఏ అండ్ యూడీ కార్యదర్శి కె. ఇలంబరితి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రిన్సిపల్ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, సీఎంవో కార్యదర్శి కె. మణిక్యరాజ్, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కె.వి.బి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అప్పుల భారం పెరగడంతో..
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ తాజా వార్షిక నివేదిక ప్రకారం సంస్థకు కార్యకలాపాలు, ఇతర మార్గాల ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,108.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ. 1,399.31 కోట్ల ఆదాయం కంటే 21 శాతం తక్కువ. అలాగే 2024–25లో పన్నుల చెల్లింపునకు ముందు రూ. 625.88 కోట్ల నష్టం నమోదవగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 555.04 కోట్లుగా నమోదైంది. మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టు కోసం ఎల్ అండ్ టీ 2010 సెపె్టంబర్‌లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో రాయితీ ఒప్పందం కుదుర్చుకొని 2011 మార్చిలో ప్రాజెక్టు ఫైనాన్షియల్ క్లోజర్‌ను పూర్తిచేసింది.
తొలి దశ ప్రాజెక్టుకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 10 బ్యాంకుల కన్సార్షియం రుణం మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో జాప్యంతో వ్యయ భారం పెరగడంతో తమకు రూ. 3,756 కోట్లను తిరిగి చెల్లించాలని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ 2017 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే 2020 ఫిబ్రవరిలో మెట్రో తొలి దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే నాటికి ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌పై ఆర్థిక భారం రూ. 5 వేల కోట్లకు పెరిగింది.
రెండు నుంచి తొమ్మిదవ స్థానానికి..
హైదరాబాద్‌లో మెట్రో రైల్ పొడవు పరంగా దేశంలో 2014లో రెండవ స్థానంలో ఉండగా ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది. పలు నగరాలు మెట్రోను విస్తరించినా హైదరాబాద్‌లో మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న రవాణా డిమాండ్‌ను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2ఏ, 2బీ విస్తరణ కింద 8 లైన్లకు సంబంధించిన 163 కి.మీ. పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను ప్రతిపాదించడం తెలిసిందే.