HYD Metro: సీన్‌ కట్‌ చేస్తే.. నష్టం రోజుకు రూ.కోటి! 

Hyderabad Metro Rail Loss Nearly RS 1 Crore In A day - Sakshi

వేళలు పెంచినా పెరగని మెట్రో రద్దీ

మధ్యాహ్నం వేళల్లో రైళ్లు ఖాళీ..

లక్ష మార్కు దాటని ప్రయాణీకులు...? 

వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్న సిటీజనులు

సాక్షి, హైదరాబాద్‌:  మెట్రో రైల్‌.. హైదరాబాదు నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన ప్రయాణ సాధనం.. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నగరవాసి కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించవచ్చు..అందుకే చాలామంది ఉపయోగించుకున్నారు.. ఎంతగా అంటే.. రోజుకు దాదాపు 4.5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇపుడు రోజుకు కనీసం లక్ష మంది కూడా మెట్రోను ఉపయోగించడం లేదు. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. కరోనా థర్డ్‌ వేవ్‌ భయంతో అధికశాతం మంది వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు.

దీంతో హెచ్‌ఎంఆర్‌కు రోజుకు దాదాపు రూ.కోటి నష్టం వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్‌డౌన్‌ అనంతరం గ్రేటర్‌ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను ఉదయం 7 నుంచి రాత్రి 10.45 గంటల వరకు పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మార్గాల్లో లక్ష మార్కును కూడా దాటకపోవడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు కోటిరూపాయల నష్టంతో మెట్రో నెట్టుకొస్తున్నట్లు సమాచారం. 

అయినా సీన్‌మారలేదు.. 
లాక్‌డౌన్‌ సమయంలో పరిమితవేళలు మెట్రో పాలిట శాపంగా పరిణమించాయి. మరోవైపు గ్రేటర్‌ పరిధిలోని సుమారు వెయ్యికి పైగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ఫ్రం హోంకు అనుమతిచ్చాయి. దీంతో మెట్రో రద్దీ ఒక్కసారిగా పడిపోయింది. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది జర్నీ చేయడం గమనార్హం. ఇప్పుడు కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ భయంతో మెజార్టీ సిటీజనులు ఇంకా వ్యక్తిగత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలు మినహా మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లో సరాసరిన నిత్యం 50 వేలు, నాగోల్‌–రాయదుర్గం రూట్లో నిత్యం సుమారు 30 వేలు, జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ రూట్లో సుమారు పదివేల మంది మాత్రమే జర్నీ చేస్తున్నట్లు సమాచారం.  

నష్టాల జర్నీ.. 
గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు గత నాలుగేళ్లుగా నష్టాల జర్నీ తప్పడంలేదు. సుమారు రూ.16 వేల కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టుకు ప్రయాణీకుల చార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియల్టీ ప్రాజెక్టులు, మాల్స్‌ అభివృద్ధి ద్వారా ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం లేదు. దీంతో నిత్యం మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, భద్రతకు అత్యధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. రోజుకు సుమారు కోటి రూపాయల నష్టంతో మెట్రో కనాకష్టంగా నెట్టుకొస్తోంది. ఇదే తరుణంలో తమను ఆదుకోవాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు ఇటీవల సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో కోరాయి. సీఎం సానుకూలంగా స్పందించినా.. మెట్రోకు రాష్ట్ర సర్కారు నుంచి ఏవిధంగా ఆర్థిక సాయం అందుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.   

ప్రస్తుతం ఇదీ లెక్క(రోజుకు) 

రూట్‌ ప్రయాణికుల సంఖ్య
ఎల్బీనగర్‌- మియాపూర్‌ 50 వేలు
నాగోల్‌-రాయదుర్గం 30వేలు
జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ 10వేలు

(గతంలో ఈ మూడు రూట్లలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణించేవారు)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top