
దశలవారీగా మెట్రో విస్తరణ అభివృద్ధి ప్రణాళికలు
ట్రిపుల్ ఆర్ వరకు ప్రజారవాణాపై లీ అసోసియేట్స్ అధ్యయనం
మొదటి, రెండు దశల్లో 231.5 కి.మీ.
2040 నాటికి 340 కి.మీ.కు పెంచాలని ప్రతిపాదన... సెప్టెంబర్ నాటికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: వచ్చే 25 ఏళ్లలో అంటే 2050 నాటికి 640 కి.మీ. వరకు మెట్రోరైల్ విస్తరణ చేపట్టాలని లీ అసోసియేట్స్ అధ్యయన సంస్థ ప్రతిపాదించింది. అప్పటివరకు హైదరాబాద్ మహానగర జనాభా 3.5 కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీంతో సుమారు 65 లక్షల మందికి పైగా మెట్రోసేవలను వినియోగించుకుంటారని పేర్కొంది. భవిష్యత్ ప్రజారవాణా అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణ ఎంతో కీలకమని ఈ సంస్థ స్పష్టం చేసింది. 2050 నాటికి నాలుగు దశలుగా విస్తరణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది.
రీజనల్ రింగ్‌రోడ్డు వరకు హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించిన నేపథ్యంలో ఇందుకనుగుణంగా అన్నివైపులా కనెక్టివిటీని పెంచాల్సి ఉంది. సమగ్ర మాస్టర్‌ప్లాన్–2050లో భాగంగా ప్రభుత్వం సమగ్ర రవాణా ప్రణాళికపై లీ అసోసియేట్స్‌ను కన్సల్టెన్సీగా నియమించింది. రోడ్లు, రవాణా సదుపాయాలు, ఎంఎంటీఎస్‌తోపాటు మెట్రో సేవల విస్తరణపై ఈ సంస్థ ప్రధానంగా అధ్యయనం చేస్తోంది. ఇప్పుడు రెండో దశలో 8 మార్గాల్లో మెట్రో విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇది 2030 నాటికి వినియోగంలోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు చేరనుంది.
మూడో దశలో 2040 నాటికి పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 340 కి.మీ. వరకు విస్తరించాల్సి ఉందని అంచనా వేసింది. మూడో దశ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికులు 35 లక్షలు దాటొచ్చునని అంచనా. ఇలా 2050 నాటికి 640కి.మీ వరకు మెట్రో మార్గాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంస్థ సెప్టెంబర్‌లో తుది నివేదికను సమరి్పంచనుంది.
రెండో దశ పూర్తయితే 231.5 కి.మీ.
ప్రస్తుతం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ వల్ల కొత్తగా 162.5 కి.మీ. వరకు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రజారవాణాలో మెట్రోరైల్ మాత్రమే కీలకమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం
హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వి కారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) ఏర్పడింది. ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేసేందుకు ప్రభుత్వం క్రిసిల్ ప్రైవే ట్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. ఈ సంస్థ త్వరలో దీనిపై నివేదికను అందజేయనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 35ఆర్థిక మండ లాలు, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. ప్రపంచంలోని టాప్–10 నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టేందుకు అమలు చేయాల్సిన భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై క్రిసిల్ నివేదికను ఇవ్వనుంది.