సృజన భళా... ఆరోగ్య మేళా... 

Hyderabad: Innovative Innovations Startups in Bio Asia - Sakshi

బయో ఆసియాలో స్టార్టప్‌ల వినూత్న ఆవిష్కరణలు 

సాక్షి, హైదరాబాద్‌: సూది గుచ్చడం దగ్గర నుంచి సర్జరీ దాకా అవసరమైన సందర్భాల్లో నొప్పి తెలీకుండా చేసే ఉత్పత్తి ఏదైనా ఉంటే? మనం ఇంట్లో కూర్చుని ఓ వైపు మన పని మనం చేసుకుంటుండగానే మన హార్ట్‌ బీట్, బ్లడ్‌షుగర్‌ స్థాయిలు వైద్యునికి తెలిసిపోతూ ఉంటే..? ఆకాశమే హద్దుగా ఆరోగ్యరంగంలో వెల్లువెత్తుతున్న సృజన సాకారం చేస్తున్న అద్భుతాలివి... వీటన్నింటికి అద్దం పడుతోంది నగరంలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు. ఇందులో విజేతలుగా నిలిచిన స్టార్టప్‌లు చేసిన ఆవిష్కరణలు ఇలా..

అందుబాటు ధరలో కృత్రిమ అవయవాలు 
వైకల్య బాధితులను దృష్టిలో పెట్టుకుని అత్యంత తేలికగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉత్పత్తులు రూపొందించాం. ప్రస్తుతం మేము చేతులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. త్వరలో ప్రధాన అవయవాలనూ అందుబాటులోకి తెస్తాం. సహజమైన శరీర భాగాల తరహాలోనే ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్పత్తులు రూ7 లక్షల వరకుంటే.. మా ఉత్పత్తులు రూ.1.50 లక్షల్లోనే లభిస్తున్నాయి. 
– మునీష్‌ కుమార్, ఎగ్జోబొట్‌ డైనమిక్స్‌ సంస్థ సీఈఓ  

కేన్సర్‌ మందుల సృష్టితో... 
అంతర్జాతీయ మార్కెట్‌ కోసం కేన్సర్‌ మందులను తయారు చేసే సంస్థని మూడేళ్ల క్రితం ప్రారంభించాం. ఫస్ట్‌ ఇన్‌ క్లాస్‌ మెకానిజమ్‌తో దేశంలోనే మాది తొలి సంస్థ. లంగ్‌ కేన్సర్, ట్రిపుల్‌ నెగిటివ్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌కు డ్రగ్‌ను అభివృద్ధి చేశాం. దీనిని త్వరలోనే మనుషుల మీద ప్రయోగించనున్నాం. దేశంలో ఇంతవరకు ఎవరూ చేయని మెకానిజమ్‌ను అనుసరిస్తూ ఈ డ్రగ్‌ను తెస్తున్నందుకే మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.  
–సీఎస్‌ఎన్‌ మూర్తి, సీఈఓ సత్య ఫార్మా ఇన్నోవేషన్స్, హైదరాబాద్‌ 

ఆరోగ్యం చెప్పే మెషీన్‌ 
బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో కనిపించే వెయింగ్‌ మెషీన్‌ తరహాలో ఓ అధునాతన మెషీన్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్‌కు చెందిన పల్స్‌ యాక్టివ్‌ స్టేషన్స్‌ నెట్‌వర్క్‌ రూపొందించింది. ఈ మెషీన్‌ మీదకు ఎక్కి స్క్రీన్‌ ముందు నిలబడి మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు ఎంట్రీ చేస్తే చాలు. మన ఆరోగ్య వివరాలు వాట్సాప్‌కు వచ్చేస్తాయి.

ఇందులో మన బరువు, ఎత్తు, బీఎంఐ, బీపీతోపాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని, ఫిట్‌నెస్‌ స్థాయిని, డయాబెటిస్‌ అవకాశాల్ని కూడా అంచనా వేస్తుంది. మెషీన్‌ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేశామని భవిష్యత్తులో అన్ని ఆసుపత్రుల్లో బహిరంగ ప్రదేశాల్లో అమర్చేలా ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జోగిందర్‌ తనికెళ్ల చెప్పారు. ధర రూ.2.50 లక్షలు.  

నేరుగా వైద్యుడికి నివేదికలు..
ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకోవడంతోపాటు ఆ పరీక్షల ఫలితాలు నేరుగా మన వైద్యునికి చేరేలా ఉత్పత్తులు సృష్టించారు ‘ఆబో 1008 డిజిటల్‌ హెల్త్‌ కేర్‌’ సంస్థకు చెందిన నగరవాసి సత్యదేవ్‌. పల్స్‌ రేట్, బీపీ, ఈసీజీ, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర శాతం ఇవన్నీ కలిపి హెల్త్‌ బోట్‌ డివైజ్‌ ద్వారా పరీక్షించుకునే సదుపాయాన్ని తెచ్చారు.

అలాగే నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి స్థాయిలు, మహిళల రుతుక్రమ సమస్యలు తెలుసుకునే ఉంగరం మాదిరి ఉండే పరికరాన్నీ రూపొందించారు. చర్మ పరీక్షలు, చెవి, గొంతు సమస్యలు తెలుసుకోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల్ని గుర్తించడానికి ఆబో వన్‌ డివైజ్‌లను తయారుచేశారు. ఇంట్లో చేసుకున్న ఈ పరీక్షల రిపోర్టులు నేరుగా వైద్యునికి చేరేలా అప్లికేషన్‌ రూపొందించామన్నారు.   

విద్యుత్‌ అవసరం లేని ‘ఫ్రీజర్‌’.. 
కొన్ని రకాల వైద్య చికిత్సల్లో ఉపయోగించే ఉత్పత్తుల్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో భధ్రపరచాల్సి ఉంటుంది. దీని కోసం ఇప్పటిదాకా థర్మాకోల్‌తో చేసిన బాక్స్‌లనే ఉపయోగిస్తుండగా, బయోస్యూర్‌ పేరుతో షిప్పర్‌ బాక్స్‌లను మ్యాక్‌ఫై అనే సంస్థ రూపొందించింది. విద్యుత్‌ అవసరం లేకుండా రోజుల తరబడి ఫ్రీజర్‌ సేవల్ని అందించే ఈ బాక్స్‌ను వెజిటబుల్స్‌ దాచుకోవడానికీ వాడొచ్చని సంస్థ చెప్పింది. పేస్‌ ఛేంజ్‌ మెటీరియల్‌ ఉపయోగించి దీన్ని చార్జ్‌ చేయాల్సి ఉంటుందని, ఒకసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే నిర్ణీత ఉష్ణోగ్రతను 24గంటలపాటు ఉంచుతుందని పేర్కొంది.

అందరికీ ప్రాథమిక వైద్యం కోసం... 
ప్రాథమిక వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా హెల్త్‌ కాన్‌ అండ్‌ మెడ్‌ టెక్‌ స్టార్టప్‌ లక్ష్యం. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రజలకు డిజిటల్లీ ట్రాన్స్‌ఫార్మ్‌డ్‌ సొల్యూషన్స్, మొబైల్‌ హెల్త్‌ సొల్యూషన్స్, అనలటిక్స్‌ ద్వారా హెల్త్‌కేర్‌ను చేరువ చేస్తున్నాం. అపోలో టెలీ హెల్త్‌తో కలిసి దేశవ్యాప్తంగా 440 కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. బయో ఆసియాలో లభించిన ఈ గుర్తింపు మా సేవలకు మరింత స్ఫూర్తినిస్తుంది.  
– డా.ప్రణయ్‌ కార్గ్, ప్రతిభ హెల్త్‌కాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

ఎలాంటి ఇన్ఫెక్షన్‌ అయినా సరే ఇట్టే గుర్తించే పేపర్‌ ఆధారిత డివైజ్‌... రాంజా జీనో సెన్సర్‌ కూడా టాప్‌ 5లో నిలిచింది. అమెరికాలోని ఎండీ ఆండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్‌కు చెందిన ల్యాంబ్‌డజెన్‌ థెరప్యూటిక్స్‌ కూడా ఈ జాబితాలో నిలిచింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top