కళ్లూ, చేతులు పోయాయి సారూ.. అయినా కనికరించరా? | Hyderabad: Handicapped Person Attempts To Suicide At Mro Office Vikarabad | Sakshi
Sakshi News home page

కళ్లూ, చేతులు పోయాయి సారూ.. అయినా కనికరించరా?

Feb 25 2022 9:15 AM | Updated on Feb 25 2022 5:26 PM

Hyderabad: Handicapped Person Attempts To Suicide At Mro Office Vikarabad - Sakshi

బాధితులకు నచ్చజెబుతున్న ఎస్‌ఐ, ఆర్‌ఐ తదితరులు

సాక్షి,పెద్దేముల్‌( వికారబాద్‌): ఆరు నెలల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి సర్వసం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అధికారులు కనీసం సదరం సరిఫికెట్‌ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దేముల్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బేగరి యాదప్ప, గీత దంపతులకు ఏకైక  కుమారుడు వెంకటయ్య.

అనారోగ్యంతో కొంతకాలం క్రితం గీత మృతి చెందింది. దీంతో తండ్రీకొడుకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జూలై 2021లో యాదప్ప ఇంటి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యాదప్ప కుమారుడు వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని కళ్లూ, రెండు చేతులు పోయాయి. ఒకరి సహాయం లేనిదే బయటకు వెళ్లలేని దుర్భర స్థితి. పేలుడు పదార్థాలకు కావాల్సిన సామగ్రి స్థానిక ఇరిగేషన్‌ కార్యాలయంలో లభ్యం కావడంతో అప్పట్లో ఆ శాఖ అధికారులు రూ.3 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో రూ.1,20 లక్ష నగదు అందచేశారని, మిగతా డబ్బులు, భూమి ఇవ్వటం లేదని యాదప్ప తెలిపారు.

ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్‌ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ఇటీవల పెద్దేముల్‌కు వచ్చిన కలెక్టర్‌ నిఖిల దృష్టికి తహసీల్దార్‌ తీసుకెళ్లారు. పూట గడవని తమకు కనీసం పింఛన్‌ మంజూరు చేయాలని తండ్రీకొడుకు వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌.. వారికి సదరం సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆదేశించారు. అయినా అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు గురువారం మధ్యాహ్నం పెట్రోల్‌ డబ్బాతో తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటుండగా.. గమనించిన అక్కడున్న వారు పెట్రోల్‌ డబ్బాను లాక్కున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ ఫయీమ్‌ఖాద్రీ వారిని సముదాయించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.  తండ్రీకొడుకుకు తహసీల్దార్, ఎస్‌ఐ నాగరాజు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  ఽ

సర్టిఫికెట్‌ ఇవ్వండి: ఎమ్మెల్యే  
తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి జిల్లా వైద్యాధికారికి ఫోన్‌ చేసి, వెంటనే సదరం సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆదేశించారు. తండ్రీకొడుకును అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆటోలో వికారాబాద్‌కు తరలించారు.


    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement