
పునరుద్ధరణకు నోచుకోని హైదరాబాద్ టు చికాగో ఫ్లైట్
నగరం నుంచి అమెరికాకు ఏటా 10 లక్షల మంది ప్రయాణం
డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడంతో ఇబ్బందులు కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం
గంటల తరబడి పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టు చికాగో ఎయిర్ ఇండియా విమానం. కేవలం పదహారున్నర గంటల్లో చేరుకొనే సదుపాయం. యూఎస్‌లోని అత్యధిక రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో ఒకటైన చికాగోకు హైదరాబాద్ నుంచి నేరుగా బయలుదేరే సదుపాయం ఉండడంతో ప్రయాణికులకు గొప్ప ఊరటనిచ్చింది. కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండానే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్‌కు వెళ్లే విద్యార్థులు, వ్యాపారులు, బంధుమిత్రులు చికాగో ఫ్లైట్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగించారు.
రెండు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య 2021లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విమాన సర్వసు అనతి కాలంలోనే ఆగిపోయింది. కోవిడ్ కారణంగా పలు విమాన సర్వసులను నిలిపివేశారు. అందులో భాగంగా హైదరాబాద్– చికాగో సర్వసుకు సైతం బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సర్వసును పునరుద్ధరించలేదు. హైదరాబాద్– చికాగో విమానాన్ని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా మరిన్ని నగరాలకు అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం 24 గంటలకు పైగా ప్రయాణం చేసి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది.
30 శాతానికి పైగా పెరిగిన రద్దీ..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి లో యూఎస్‌కు రాకపోకలు సాగించేవారి సంఖ్యే అధికం. మిగతా ప్రయాణికులు ఎక్కువగా దుబాయ్, యూరప్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రా ల నుంచి యూఎస్‌కు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పర్యాటకులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు.
2020లో హైదరాబాద్ నుంచి అమెరికాకు సుమారు 8.5 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ ఐదారేళ్లలో ప్రయాణికుల రద్దీ సుమారు 30 శాతం పెరిగినట్లు అంచనా. కానీ ప్రయాణికుల డిమాండ్, రద్దీ మేరకు నేరుగా బయలుదేరేందుకు విమాన సరీ్వసులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పలు ఎయిర్‌లైన్స్‌కు చెందిన 25 విమానాలు కనెక్టింగ్ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. లుఫ్తాన్సా, పసిఫిక్ క్యాథీ, ఎమిరేట్స్, ఎత్తెహాద్, ఖతార్, తదితర ఎయిర్‌లైన్‌కు చెందిన విమానాలు ఢిల్లీ, ముంబయి, దుబాయ్, దోహా, ఫ్రాంక్‌ఫర్ట్, లండన్ తదితర ఎయిర్‌పోర్టుల నుంచి సరీ్వసులను అందజేస్తున్నాయి.
24 గంటలకు పైగా పడిగాపులే....
హైదరాబాద్ నుంచి దుబాయ్, దోహాల మీదుగా బయలుదేరే ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు చేరుకోవడానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిచిపోతోంది. ట్రాన్సిట్ ఎయిర్‌పోర్టుల్లోనే ఎదురుచూడాల్సి వస్తోంది’ అని హిమాయత్‌నగర్‌కు చెందిన ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయం ఉంటే 12 నుంచి 17 గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ నుంచి 75 శాతం మంది ప్రయాణికులు డల్లాస్, న్యూయార్క్, చికాగో, అట్లాంటా, బోస్టన్, లాస్‌ఏంజిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాలకు ప్రయాణం చేస్తున్నట్లు అమీర్‌పేట్‌కు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
రోజుకు 5 విమానాల డిమాండ్..
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారుల అంచనాల మేరకు ప్రతి రోజు 1462 మంది యూఎస్‌కు ప్రయాణం చేస్తున్నారు. అంటే కనీసం 5 విమానాల ఆక్యుపెన్సీకి తగినట్లుగా ప్రయాణికుల డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారవర్గాలకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు. వారానికి కనీసం 3 డైరెక్ట్ ఫ్లైట్‌లు అందుబాటులో ఉన్నా ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది.