బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు

Hyderabad: 15 Fall Ill After Consuming Polluted Water in Musheerabad - Sakshi

మొన్న వడ్డెర బస్తీ.. నేడు చేపల మార్కెట్‌

పొంచి ఉన్న అతిసారం ముప్పు 

నగరంలో సుమారు 2 వేల కి.మీ. పరిధిలో పురాతన తాగునీటి పైప్‌లైన్లు? 

వీటిని మారిస్తేనే కలుషిత జలాల సమస్య పరిష్కారం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు బస్తీల వాసులకు కలుషిత జలాలు శాపంగా పరిణమిస్తున్నాయి. గతంలో భోలక్‌పూర్‌.. ఇటీవల మాదాపూర్‌ వడ్డెర బస్తీ.. మంగళవారం ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ ప్రాంతంలో కలుషిత జలాల కారణంగా పలువురు బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో అతిసారం ప్రబలడం కలవరం సృష్టిస్తోంది. మరుగుదొడ్లు, అపరిశుభ్ర పరిసరాలు, గుంతల్లో నల్లా లేని కనెక్షన్లతో పాటు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పురాతన తాగునీటి పైప్‌లైన్లు ఏదో ఒకచోట తరచూ ఈ పరిస్థితికి కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

పాత నగరంతో పాటు ప్రధాన నగరంలో సుమారు రెండువేల కిలోమీటర్ల పరిధిలో పురాతన పైప్‌లైన్లు ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటి స్థానంలో తక్షణం డక్టైల్‌ ఐరన్‌ (డీఐ), మైల్డ్‌స్టీల్‌ (ఎంఎస్‌) పైప్‌లైన్లు ఏర్పాటు చేసి పైప్‌లైన్‌ లీకేజీల కారణంగా ఏర్పడుతున్న కలుషిత జలాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 
 
పురాతన పైప్‌లైన్ల మార్పుతోనే పరిష్కారం.. 
► మహానగరం పరిధిలో సుమారు 9 వేల కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో పాతనగరం, ప్రధాన నగరం పరిధిలో సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ సామర్థ్యాలున్న పురాతన పైప్‌ లైన్లున్నాయి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడడం, పక్కనే మురుగు నీటి పైప్‌లైన్లు, నాలాలుండడంతో తరచూ మురుగు నీరు లీకేజీ ఏర్పడిన తాగునీటి పైప్‌లైన్లలోకి చేరి శుద్ధి చేసిన తాగునీరు కలుషితమవుతోంది.  

► ఈ నీటిని తాగిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటిని తక్షణం మార్చితేనే కలుషిత జలాల సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, కార్వాన్‌ తదితర నియోజకవర్గాల పరిధిలోనే పురాతన పైప్‌లైన్లు అత్యధికంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటిని మార్చేందుకు సుమారు రూ.1500 కోట్లు  అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. 
 
ఇవీ కారణమే.. 
► పలు బస్తీల్లో ఇళ్ల ముందున్న కనెక్షన్లు గుంతల్లో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. వీటికి చాలా ప్రాంతాల్లో  నల్లాలు లేవు. ఇవన్నీ మరుగుదొడ్లు, దుస్తులు, వంట పాత్రలు శుభ్రం చేసుకునే ప్రదేశాలకు ఆనుకొని ఉన్నాయి. దీంతో ఈ మురుగు నీరు నల్లా గుంతల్లోకి చేరుతోంది.  

► మంచినీటి సరఫరా జరిగిన అనంతరం ఈ మురుగు నీరు ఆయా కనెక్షన్లలోకి రివర్స్‌ వెళుతోంది. తిరిగి తాగునీటి సరఫరా జరిగిన సమయంలో నల్లా నీటితో పాటు ఈ మురుగు నీరు వస్తోంది. ఈ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురవుతున్నట్లు వడ్డెర బస్తీలో జలమండలి క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది.  

► మహానగరం పరిధిలోని సుమారు 1470 మురికి వాడలున్నాయి. పలు బస్తీల్లో కనెక్షన్లకు నల్లాలు లేని చోట జలమండలి జీఐ పైప్‌లైన్లతో తక్షణం నల్లా కనెక్షన్లను కొంత ఎత్తున.. పబ్లిక్‌ నల్లా తరహాలో ఏర్పాటు చేయాలి. దీంతో కలుషిత ముప్పు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. (క్లిక్‌: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌)

జలమండలి మేనేజర్, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌  
ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌లో కలుషిత జలాల కలకలం నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్‌ సీరియస్‌ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను అరికట్టేందుకు నూతన పైప్‌లైన్‌ వర్క్‌ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టనందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ను మంజూరు చేసినట్లు ఎండీ తెలిపారు. (చదవండి: కేసీఆర్‌ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top