వారంతా ఉద్యోగులు, విద్యార్థులు.. ఓపిక, సహనంతో పోరాటం.. ఇంతకీ ఏం చేస్తారో తెలుసా?

HYD: Animal Warriors Conservation Society Saves Animals Lifes - Sakshi

సాక్షి, రాయదుర్గం: వారంతా ఉద్యోగులు..విద్యార్థులు. ఓపిక, సహనం, ఓర్పుతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన జంతువులు, పక్షులను రక్షించాలనే తపనతోనే “యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’(ఏడబ్ల్యూసీఎస్‌)ని స్థాపించారు. ఏడాదిలో 365 రోజులు ఎలాంటి సెలవు, పండగ అనే విరామమే లేకుండా పశుపక్ష్యాదుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐటీ కారిడార్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని గోపన్‌పల్లి, కొండాపూర్, హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్, చందానగర్‌ వంటి ప్రాంతాల్లో ఆపదలో ఉన్న పక్షులను రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బావి, చెరువు, సంపులో పడిపోయిన జంతువులు, పక్షులను రక్షించడం, కాళ్లు, రెక్కలకు పతంగుల మాంజా చిక్కి చెట్లకు వేలాడం, టెర్రస్‌లోకి పెంపుడు జంతువులు వెళ్లి అక్కడి నుంచి రాలేకపోవడం వంటి వాటిని రక్షించి, వాటికి సపర్యలు చేసి ఎగిరి వెళ్లగలిగే స్థితికి తెచ్చి పంపించి వేసే విధంగా ఈ బృందం పనిచేస్తోంది. 


 బావిలో పడ్డ కుక్కను రక్షించేందుకు యత్నిస్తున్న ఏడబ్ల్యూసీఎస్‌ బృంద సభ్యుడు

2019లో ఏడబ్ల్యూసీఎస్‌ ఏర్పాటు  
► సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రదీప్‌నాయర్, అమర్, సంజీవ్‌వర్మ, సంతోషి కలిసి ఈ యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీని 2019 జనవరిలో ఎన్‌జీఓగా ఏర్పాటు చేశారు.  
► మొదట్లో 12 మంది సభ్యులుండగా, ప్రస్తుతం మనీష్, అనిరుద్, రాఘవ, గణేష్, ప్రభు, రాహుల్, శశిధర్‌తో పాటు 18 మంది సభ్యులుగా చేరారు.  
► వీరంతా పక్షి, జంతువు ఆపదలో ఉందని ఫోన్‌ రాగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లడం, ఆ తర్వాత దాన్ని రక్షించడంపైనే దృష్టి సారిస్తారు.  
► ఇప్పటి వరకు 330 పక్షులు, 44 ఉడుతలు, 50 పాములు, 306 కుక్కలు, 139 పిల్లులు, 19 పశువులు, 14 కోళ్లు, ఇతరత్రా వాటిని ఈ ఏడాది రక్షించారు.  
► పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1200 కిలోల ప్లాస్టిక్‌ నెట్లు, ఇతరత్రా సామగ్రి, 455 కేజీల ప్లాస్టిక్‌ సీసాలు సేకరించారు. 

ఐటీ కారిడార్‌లో ఏటా మాంజాతోనే 250–300 పక్షులకు ఆపద  
► ఐటీకారిడార్‌లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత మాంజాతో ఏటా వందలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. 
► 250 నుంచి 300 వరకు పక్షులను డిసెంబర్‌ నుంచి జనవరి చివరి వరకు రక్షించిన దాఖలాలు ఉన్నాయి.  
►  ప్రధానంగా గాలిపటాలు ఎగురవేసిన తర్వాత అవి కాస్తా దారంతో వెళ్లి చెరువు, ఇతరత్రా ఖాళీ స్థలాలలోని చెట్లపై పడిపోతాయి.  
►  ఈ మధ్యలో రకరకాల పక్షులు చెరువులో నీరే తాగేందుకు వచ్చి చెట్టుపై సేద తీరే సమయంలో రెక్కలు, కాళ్లకు పతంగి మాంజా చుట్టుకొని గాయాల పాలు కావడం జరుగుతోంది. ఇది ఎవరైనా చూస్తే సమాచారం ఇస్తారు.  
► చెట్లకు వేలాడుతూ అలాగే కొన్ని రోజులపాటు గాయాల బారిన పడి అక్కడే మృత్యువాత పడిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. 

హెచ్‌సీయూతో పనిచేసిన ఏడబ్ల్యూసీఏ బృందం..  
►  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీతో కూడా ఏడబ్ల్యూసీఏ బృందం కలిసి పనిచేసింది. 
► గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో హెచ్‌సీయూ క్యాంపస్‌ పరిధిలోని పశు,పక్ష్యాదుల కోసం విద్యార్థులు, అధికార యంత్రాంగంతో కలిసి వాటికి ఆహారం, ఇతరత్రా సేవలందించడంలో తమవంతు పాత్ర పోషించారు.  
►  హెచ్‌సీయూలో పర్యావరణ పరిరక్షణకు పశు,పక్ష్యాదుల రక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ బృందం యత్నిస్తోంది. 


 
సంస్థ కోరే సాయం
► సంస్థ నిర్వహణకు  ప్రత్యేక స్థలం కేటాయించాలి. 
► పశు,పక్ష్యాదులకు తీవ్ర గాయాలైతే రక్షించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అందించాలి. 

గోపన్‌పల్లిలో వరుసగా మూడోసారి 
►  ఈ ఏడాది గోపన్‌పల్లిలో ఇటీవలే వరుసగా మూడోసారి చెరువు మధ్యలో ఉన్న కంపచెట్టుకు ఉన్న మాంజా  కొంగ కాళ్లకు చుట్టుకొవడంతో వేలాడుతూ ప్రాణాపాయస్థితికి చేరింది. 
► ఇలాంటి ఘటనలు ఈ నెలరోజుల్లో 3సార్లు చోటు చేసుకోగా ఈ బృందం భారీ తాడు, కర్రల సహాయంతో పక్షి దగ్గరకు ఛాతీ వరకున్న చెరువునీటిలో సాయంత్రం వేళల్లో వెళ్లి కొంగను రక్షించారు.   


అగ్నిమాపక శాఖ సాయంతో పావురాన్ని రక్షించిన ఏడబ్ల్యూసీఎస్‌ బృందం 

ఐటీ కారిడార్‌లో ఏటా మాంజాతోనే పక్షులకు ప్రమాదం  
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంజాతో పక్షులకు ప్రమాదం చోటు చేసుకుంటోంది. ఐటీ కారిడార్‌ హైటెక్‌సిటీ, కొండాపూర్, గోపన్‌పల్లి పరిసరాల్లో చెరువులు, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో చెట్లకు మాంజా తగులుకోవడంతో ఇది పక్షుల కాళ్లు, రెక్కలకు చుట్టుకోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నాయి. చూసిన వాళ్లు సమాచారం ఇస్తే వాటిని రక్షిస్తున్నాం. లేకపోతే అవి మృతి చెందుతున్నాయి.
 – మనీష్, జాయింట్‌ సెక్రటరీ, ఏడబ్ల్యూసీఎస్‌ 

ఉచితంగానే సేవలు 
ఆపదలో ఉన్న పశు,పక్ష్యాదులను ఉచితంగానే రక్షిస్తాం. సమాచారం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండానే వాటిని రక్షిస్తున్నాం. ఒక్కో రెస్క్యూకు వాహనాల వ్యయం రూ.2,500 నుంచి మూడువేల వరకు అవుతుంది. అగ్నిమాపక శాఖ, డీఆర్‌ఎఫ్‌ బృందాల సహకారం కూడా తీసుకుంటాం. ప్రభుత్వ సహాయం అందిస్తే   మేలు చేకూరుతుంది. ప్రదీప్‌ నాయర్, ఇతర సభ్యులు, అమర్‌ వంటి వారితో అవగాహన, శిక్షణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వడం చేస్తున్నాం. పశు,పక్ష్యాదులు ఆపదలో ఉంటే 9697887888కు ఫోన్‌ చేయండి.     
– సంజీవ్‌వర్మ,ప్రధాన కార్యదర్శి, ఏడబ్ల్యూసీఎస్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top