కమీషన్‌కే ఏటా రూ.600 కోట్లు! | Huge Money to Agencies that supply employees through outsourcing | Sakshi
Sakshi News home page

కమీషన్‌కే ఏటా రూ.600 కోట్లు!

Dec 23 2025 2:15 AM | Updated on Dec 23 2025 2:15 AM

Huge Money to Agencies that supply employees through outsourcing

ఔట్‌ సోర్సింగ్‌ కొలువులతో ‘ఏజెన్సీ’లకే సిరుల పంట

నెలవారీ వేతనాల నుంచి ఏజెన్సీలకు 4% కమీషన్‌ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

నెలకు సగటున రూ.50 కోట్లు ఆర్జిస్తున్న ఏజెన్సీలు.. రకరకాల కోతలు, వడ్డీ రూపంలోనూ లబ్ధి 

వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4.93 లక్షల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు  

కమీషన్, ఇతరత్రా కోతలు పోను వీరికి స్వల్ప మొత్తమే దక్కుతున్న వైనం 

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏజెన్సీల బదులు ప్రత్యేక కార్పొరేషన్‌.. 4% కమీషన్‌ ఉద్యోగులకే అందుతున్న వైనం 

ఇక్కడా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలంటున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై కాసుల వర్షం కురుస్తోంది. నిర్దేశించిన విధులను నిర్వర్తించడంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శ్రమిస్తుంటే..వారికి అరకొరగా వచ్చే వేతనం నుంచి కమీషన్ల కింద ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే సొమ్ముతో ఏజెన్సీలు జేబులు నింపుకుంటున్నాయి. కేవలం కమీషన్‌ పేరిట రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.600 కోట్ల మేర సంపాదిస్తుండటం గమనార్హం. కాగా తమ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోతలు, వేతన చెల్లింపుల్లో జాప్యంతో జమ అయ్యే వడ్డీ, ఇతరత్రా రూపాల్లో అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏజెన్సీల ఇష్టానుసార నిర్ణయాలతో వారికి వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. రావాల్సిన మొత్తం కంటే తక్కువగా ముట్టజెపుతుండటంతో, పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉండటంపై ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. 

పరిపాలన సజావుగా సాగాలనే పేరిట.. 
పరిపాలనను సజావుగా కొనసాగించేందుకు, ఉద్యోగ ఖాళీలతో ఏర్పడే సమస్యను అధిగమించేందుకు ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగులను నేరుగా నియమించుకోకుండా.. ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసుకుని వాటి ద్వారా అర్హత కలిగిన వ్యక్తులను వివిధ శాఖల్లోకి తీసుకుంటోంది. ప్రభుత్వానికి అవసరమైన సర్వీసులను నేరుగా వారి నుంచి పొందుతున్నప్పటికీ.. వేతనాలను మాత్రం ఏజెన్సీల ఖాతాకు విడుదల చేస్తుండటం ఇక్కడ గమనించవలసిన విషయం. అలా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఏజెన్సీ ప్రతినిధులు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో ఏజెన్సీ కమీషన్‌తో పాటు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, జీఎస్టీ కోతపెట్టి వేతనాలు చెల్లిస్తారు. దీంతో వేతన పట్టికలో కన్పించే మొత్తం, వాస్తవంగా చేతికందే వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. 


శాశ్వత ఉద్యోగులతో దాదాపు సమానంగా.. 
రాష్ట్ర ప్రభుత్వంలోని 31 శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలకు సర్వీసులు అందిస్తున్న శాఖల్లోనే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అత్యధికంగా ఉండటం గమనార్హం. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం..పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు 5,21,692 మంది కాగా... ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నవారు 4,93,820 మంది ఉన్నారు. అయితే ఇటీవల ఆర్థిక శాఖ ఆధార్‌ వివరాలు సేకరించగా.. కేవలం 2,74,844 మంది వివరాలు మాత్రమే ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. ఆధార్‌లో పేర్లు తప్పుగా నమోదు కావగడం లాంటి కారణాలతో మిగిలిన ఉద్యోగుల వివరాలు అప్‌లోడ్‌ కాలేదు. దీంతో ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా ఎంట్రీ చేయనున్నారు.  

బేసిక్‌ కంటే తక్కువగా అందుతున్న వేతనం 
శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో వేతనాలను ఖరారు చేస్తే... ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారికి మాత్రం మూడు రకాల స్కేళ్లలో వేతనాలు అందిస్తున్నారు. జిల్లాలు, మున్సిపల్‌ కార్పొరేషన్, రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే వారిని మూడు కేటగిరీలుగా నిర్దేశించి వేతనాలు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి బేసిక్‌ వేతనం రూ.15,600గా నిర్ణయిస్తే...ఈపీఎఫ్‌ రూ.2,028, ఈఎస్‌ఐ రూ.507, జీఎస్టీ రూ.3,377, ఏజెన్సీ కమీషన్‌ రూ.624గా పేర్కొంటున్నారు. 

ఇవన్నీ కలిపితే ఉద్యోగి మొత్తం వేతనం రూ.22136 కాగా.. ఇందులో నిర్దేశించిన కేటగిరీల (ఈపీఎఫ్, ఈఎస్‌ఐ) కింద కోత పెడుతున్నారు. మరోవైపు డిడక్షన్‌ (ఇది కూడా కోతే) కింద దాదాపు రూ.2 వేలు కోత పడుతోంది. చివరకు ఉద్యోగికి రూ.13,611 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ఈ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి ఆ ఉద్యోగి బేసిక్‌ వేతనం కంటే తక్కువగా చేతికందుతోందన్నమాట. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల్లో ఎంట్రీ స్థాయిలోనే రూ.20 వేల చొప్పున వేతనాలు అందుతుండగా... ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసేవారికి అత్యంత తక్కువగా వేతనాలు అందుతుండడం గమనార్హం.  


ఉద్యోగి కష్టం ఏజెన్సీ పాలు.. 
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టం చివరకు ఏజెన్సీలపాలవుతోందనే విమర్శలున్నాయి. ఒక ఉద్యోగి సగటు వేతనం నుంచి అధికారికంగా దాదాపు 4 శాతం నేరుగా ఏజెన్సీకి వెళుతోంది. ప్రభుత్వం సకాలంలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు వేతనాల నిధులు బ్యాంకుల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఏజెన్సీలు వాటిని వెంటవెంటనే ఉద్యోగులకు విడుదల చేయడం లేదు. తద్వారా బ్యాంకులో జమ అయిన నిధులకు సంబంధించిన వడ్డీతో ఏజెన్సీలు లబ్ధి పొందుతున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు గైర్‌హాజరు, ఇతరత్రా కారణాలను చూపుతూ ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండా వేతనాల్లో కోతలు పెడుతున్నాయి. 

వాస్తవానికి ఏజెన్సీల విధానంపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాయి. ఆ కార్పొరేషన్‌ ద్వారానే ఉద్యోగుల ఎంపిక చేపట్టడంతో 4 శాతం కమీషన్‌ నిధులు కూడా నేరుగా ఉద్యోగికే అందుతున్నాయి. పైపెచ్చు ఎలాంటి అనధికారిక కోతలకు తావుండటం లేదు. ఈ విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు పక్కాగా అమలు చేస్తుండటం గమనార్హం.  

ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి 
ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీల ద్వారా ఉద్యోగుల ఎంపిక విధానంలో మార్పులు చేయాలి. ప్రభుత్వం నేరుగా నియమించుకోవడమో, లేక ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా నియమించుకోవడమో చేయాలి. దీనివల్ల ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ఈ ప్రక్రియలో కార్మిక ఉపాధి కల్పన, ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజ్‌లకు బాధ్యత అప్పగించాలి. మరోవైపు ఏజెన్సీలకు కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. దీంతో ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం అందుతుంది. కోతలకూ తావులేకుండా వేతనం అందడం వల్ల వారి జీవన పరిస్థితులు మెరుగు పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయాలి. రాష్ట్రంలో గిగ్‌ వర్కర్ల కోసం ఒక పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలి. 
– పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement