ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్‌! | Honeytrap in Army weapons theft case | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్‌!

Oct 7 2026 5:49 AM | Updated on Oct 7 2026 5:49 AM

Honeytrap in Army weapons theft case

నిందితుడు బీర్బల్‌ షాకు ఐఎస్‌ఐ మహిళా ఏజెంట్‌ మెసేజ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ నుంచి ఆర్మీ ఆయుధాల దొంగతనం కేసు దర్యాప్తులో ఊహించని సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన నిందితుల్లో ఒకరైన బీర్బల్‌ షా సోషల్‌ మీడియా ద్వారా పాకిస్తాన్‌ నిఘా సంస్థల (ఐఎస్‌ఐ) హనీ ట్రాప్‌’ఉచ్చులో పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బీర్బల్‌ షా బారక్‌పూర్‌ కంటోన్మెంట్‌ సమీపంలో చెరుకు రసం విక్రయిస్తూ.. అక్కడి ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ (ఏఎఫ్‌ఎస్‌)లో పంప్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. 

అయితే ఇతడి ఇన్‌స్ట్రాగామ్‌లో తాను ఒక వైమానిక దళ ఉద్యోగిగా నకిలీ ప్రొఫైల్‌ సృష్టించుకొని, ఖాతాను ప్రచారం చేసినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని మహిళల ఖాతాల నుంచి అతనికి మెసేజ్‌లు వచ్చాయని, వారు బీర్బల్‌ను మభ్యపెడుతూ బారక్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కార్యకలాపాల గురించి ఆరా తీసినట్టు సమాచారం. ఈ ఖాతాలు పాకిస్తాన్‌ నిఘా విభాగాలకు చెందినవి అయి ఉండొచ్చని.. అయితే బీర్బల్‌ దగ్గర ఎలాంటి కీలక సమాచారం లేదని గ్రహించిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వది లేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

డిజిటల్‌ అకౌంట్ల జల్లెడ..
ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు మాజీ హవల్దార్‌ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ తోపాటు అతని అన్న మల్లిఖార్జున్, స్నేహి తుడు నిరంజన్, పశ్చిమబెంగాల్‌కు చెందిన అక్రమ ఆయుధాల వ్యాపారులు ఆవిడే అలియాస్‌ ఓబీ, బీర్బల్‌షా, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సిపాయి కొండూరి శేషులు, నాయక్‌ వినోద్‌కుమార్, మహ బూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హవల్దార్‌ ప్రవీణ్‌లను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు నిందితులందరి ఫోన్లు, సోషల్‌ మీడియా ఖాతాలు, డిజిటల్‌ ల్యాప్‌టాప్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విదేశీ నిఘా సంస్థల లింకులపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. 

37 అకౌంట్లను ఫాలో చేసిన మల్లేశ్‌
మల్లేశ్‌ ఆయుధాల కొనుగోలు కోసం ఆన్‌ లైన్‌లో విపరీతంగా సెర్చ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తుపాకీల ఫొటోలు క్రమం తప్పకుండా పోస్ట్‌ చేసే ఒక ఖాతాతోపాటు, పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంక్వాకు చెందిన అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి డీలర్‌ ఖాతాను కూడా ఇతడు ఫాలో అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మల్లేశ్‌ మొత్తం 37 ఖాతాలను ఫాలో అయ్యేవాడని, అయితే అతని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు ఎలాంటి పోస్ట్‌లు లేవని గుర్తించారు. ఇతని ఖాతాకు కేవలం 28 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఆన్‌లైన్‌ డీలర్లతో మల్లేశ్‌ ఎలాంటి సంప్రదింపులు జరపకముందే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో అరెస్టయిన మల్లేశ్‌ బ్యాచ్‌మేట్‌ ప్రస్తుతం తమిళనాడు లోని 16వ బెటాలియన్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్న కె.ప్రవీణ్‌ కూడా అక్రమ ఆయుధాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement