
ఆనవాళ్లు కోల్పోతున్న చారిత్రక కట్టడం
కాకతీయ రాజుల హయాంలో నిర్మాణం
శిథిలావస్థకు చేరుకున్న శివాలయం
పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు
అటకెక్కిన ఎమ్మెల్యే హామీ..
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెం గ్రామ శివారులోని దుర్గం గట్టుపై కాకతీయుల కాలంలో నిర్మించిన పలు కట్టడాలు, శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి. కాకతీయుల చరిత్రను ఇనుమడింపజేసేలా ఉన్న ఈ కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు దుర్గం గట్టుపై పలు చారిత్రక కట్టడాలు, ఆలయాలు నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
దాదాపు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ గట్టుపై.. క్రీ.శ.1289 – 1323 మధ్య కాలంలో శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయంతో పాటు గట్టు చుట్టూ శత్రుదుర్భేద్యమైన రాతికోట నిర్మించారు. నీటి సౌలభ్యం కోసం గట్టుపై ఆరు బావులు తవ్వి, వాటి లోపల రాతి కట్టడాలు నిర్మించారు. ఆ బావి నీటితోనే కాకతీయులు దుర్గేశ్వర స్వామికి అభిషేకం, అర్చన చేసేవారంటారు. గుట్టపై నిర్మించిన ధ్యాన మందిరాలు నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

ఈ మందిరాల్లో ఆనాడు కాకతీయ వంశీయులు ధ్యానం చేసేవారని తెలుస్తోంది. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముప్పయ్ సంవత్సరాల క్రితం వరకు కూడా దుర్గం గట్టుపై ఉన్న శివయ్యకు విశేష పూజలు చేసి, దీపధూప నైవేద్యాలు సమరి్పంచేవారు. మహా శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహించేవారు. కాకతీయుల చరిత్రకు తార్కాణంగా నిలిచే, ఈ గట్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
సరైన మార్గం లేక..
దుర్గం గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో.. కాలక్రమేణా ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గిపోగా, నేటితరం వారికి దుర్గం గట్టు అంటే కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలయం, కాకతీయుల చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు గట్టుపై.. గుప్త నిధుల కోసం పలుచోట్ల తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలతో ఆలయంతో పాటు పలు రాతి కట్టడాలు ధ్వంసం కావడంతో.. పది సంవత్సరాల క్రితం మండల వాసులు తాత్కాలికంగా శివయ్యకు ఆలయం నిర్మించారు.
అమలుకాని ఎమ్మెల్యే హామీ
దుర్గం గట్టుపై ఆలయ పునర్నిర్మాణంతో పాటు కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాల ఆనవాళ్లను మెరుగుపరిచి, గట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని.. ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గత జనవరిలో దుర్గమ్మ గట్టును సందర్శించిన ఎమ్మెల్యే.. గట్టుపై చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే సౌర విద్యుత్ సౌకర్యంతో పాటు, తాగునీటి కోసం బోరు కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా.. అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
రవాణా సౌకర్యం లేదు
దుర్గమ్మ గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో ఆలయ ప్రాధాన్యం మసకబారిపోతోంది. గట్టు పైకి వెళ్లడానికి సరైన మార్గం ఏర్పాటు చేస్తే, తిరిగి ఆలయానికి సందర్శకులు పెరుగుతారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి, ఆలయ అభివృద్ధికి పూనుకోవాలి. – పాశం ప్రసాద్, గోపాలపురం, దమ్మపేట మండలం
చరిత్రను కాపాడుకోవాలి
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులు నిర్మించిన శ్రీ శంకరగిరి దుర్గేశ్వరస్వామి ఆలయ చరిత్ర, విశిష్టతను కాపాడుకోవలసిన అవసరం ఉంది. గట్టుపై ఉన్న ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దేవాదాయ, పర్యాటక శాఖల సహకారంతో దుర్గం గట్టును అభివృద్ధి చేసి, విద్యుత్, రవాణా, తాగు నీటి సౌకర్యాలను కల్పించాలి. – విజయ మారుతి శర్మ, దమ్మపేట