సింగరేణి సంస్థకు షాకిచ్చిన హైకోర్టు.. ఆ పోస్టుల భర్తీ నిలిపివేయండి!

High Court Says To Stop Junior Assistant Posts Fills In Singareni - Sakshi

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌– 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని సంస్థ ఉన్నతాధికారులను హైకోర్టు శనివారం ఆదేశించింది. పరీక్షలో అవకతవకలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లు వాదనకు సరిపడా ఆధారాలు చూపించారని, తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్‌మెంట్‌ సెల్‌కు ఆదేశాలు జారీచేసింది.

జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌తో సహా 8 జిల్లాలోని 187 కేంద్రాల్లో ఈనెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలు సజావుగానే నిర్వహించామని సింగరేణి, జేఏన్‌టీయూ అధికారులు చెబుతున్నా.. కొందరు అభ్యర్థులను గోవా తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడ పేపర్‌ లీకైందని ఆరోపణలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన సింగరేణి, జేఎన్‌టీయూ అధికారులు హడావిడిగా ఫలితాలు విడుదల చేశారు. 78 వేల మంది పరీక్ష రాయగా, 49 వేల మంది అర్హత సాధించారని పేర్కొంటూ వారి మార్కులు, ర్యాంకులు వెల్లడించారు.

అయితే, పరీక్ష రాసిన అభ్యర్థులంతా తమకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని, కానీ సింగరేణి అధికారులు అలా విడుదల చేయలేదని, అందరి మార్కులు వెల్లడించిన తర్వాతే ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా అర్హత పేరుతో 49 వేల మంది ఫలితాలు మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ పరిశీలించకుండా ఫలితాలు విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పపట్టింది.

అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ మొదలైన పేర్లతో హాల్‌టికెట్లు ఎలా పంపిణీ చేశారని, పరీక్ష సమయంలో అభ్యర్థి పేరు రాస్తే ఎలా పరిగణనలోకి తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. కాగా, పరీక్షకు 15 రోజుల ముందే సింగరేణిలో కీలకమైన డైరెక్టర్‌(పా) పోస్టును చంద్రశేఖర్‌ అనే వ్యక్తికి ఇచ్చారని, ఐదు నెలల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఆ వ్యక్తికి ఇప్పుడా పదవి కట్టబెట్టడంతో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top