కుక్కలను చంపారంటూ దాఖలైన పిల్‌లో హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఒకే రోజు 40 కుక్కలు చంపారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కుక్కలకు సంబంధించిన కేసులన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నందున ఇక్కడ విచారణ చేపట్టడం సబబు కాదని అభిప్రాయపడింది.
ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైదరాబాద్ శివార్లలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లోపల, చుట్టుపక్కల 40 వీధి కుక్కలను సామూహికంగా చంపిన ఘటనకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది రిషిహాస్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వర్సిటీ లోపల, వెలుపల కుక్కలను బంధించి చంపుతున్నారు. నందిగామ మండలం తహసీల్దార్, మోడల్లకుడ గ్రామ పంచాయతీ సర్పంచ్, విశ్వవిద్యాలయ అధికారుల ఆదేశాల మేరకు కుక్కలను పట్టుకుని చంపారన్నారు.
ఒకేరోజు దాదాపు 40 కుక్కల చంపిన బాధ్యులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేలా నందిగామ ఎస్‌హెచ్‌వోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే, విచారణ జరిపే వరకు కుక్కలను చంపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా 40 కుక్కలను చంపారనేందుకు సోషల్ మీడియా తప్ప ఇతర ఆధారాలున్నాయా అని జస్టిస్ మొహియుద్దీన్ ప్రశ్నించారు.
విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది ఈ మరణాల గురించి తనకు తెలియజేశారని, గ్రామ పంచాయతీ అధికారులు కూడా దీనిని ధ్రువీకరించారని న్యాయవాది బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిల్‌లో లేవనెత్తిన సమస్యలు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ‘వీధి కుక్కలకు సంబంధించిన సాధారణ సమస్యల’పరిధిలోకి వస్తాయని పేర్కొంది. పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.
జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జంతు సంక్షేమ బోర్డును వీలైనంత త్వరగా పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, చట్టప్రకారం నిర్వహించకుంటే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (ఇండియా) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా అన్ని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను వెంటనే తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
బోర్డు మొదట 2019లో ఏర్పాటు చేశారని, దాని పదవీ కాలం 2022లో ముగిసిందన్నారు. చట్టాలు కఠినంగా అమలు కావాలంటే పర్యవేక్షణ కమిటీకి నాయకత్వం వహించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలన్నారు. 2025, జనవరిలో బోర్డుకు అనధికార సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ మేరకు చర్యలు చేపట్టలేదన్నారు.
జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని, అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటివరకు బోర్డును ఏర్పాటు చేయకుంటే ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.


