
మావోయిస్టు కీలక నేత సమీపానికి వెళ్లగలిగిన భద్రతా దళాలు
చివరి నిమిషంలో తప్పించుకున్న ‘మోస్ట్ వాంటెడ్’?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా అలియాస్ సంతోశ్ మ రోసారి వార్తల్లో నిలిచాడు. హిడ్మాను పట్టుకునేందుకు వేలాదిగా పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌ను 3 రోజులుగా గాలిస్తున్నాయి. అయితే భద్రతా దళాల కన్నుగప్పి ఆయన తప్పించుకున్నట్టు సమాచారం.
హిడ్మా లొంగిపో..
మడావి హిడ్మాతోపాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ బార్సే దేవా ఎక్కడ ఉన్నారనే అంశంపై కచ్చితమైన సమాచారం తమకు లభించిందని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ఆదివారం ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని కూడా మావోయిస్టులకు ఆయన సూచన చేశారు.
ఐజీ నుంచి ప్రకటన వెలువడ్డాక ఇంద్రావతి నేషనల్ రిజర్వ్ పార్క్‌లో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగాయి. మరోవైపు ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో జరుగుతున్న కూంబింగ్, ఫైరింగ్ ఆపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. దీంతో మంగళవారం ఈ ఆపరేషన్‌కు సంబంధించి కీలక సమాచారం వెలువడుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
పది రోజులుగా గాలింపు..
మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు.. వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతోపాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.
భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోలు వచ్చాక కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ ఏడాది అగ్రనేతలు చనిపోయిన ఎదురుకాల్పుల్లో ఈ తరహా వ్యూహాలనే ఎక్కువగా అమలు చేసినట్టు సమాచారం. ఇదే మాదిరి మడావి హిడ్మా, బార్సే దేవా విషయంలోనూ పది రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్టు తెలుస్తోంది.
హిడ్మా ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్ తర్వాత...
గత నెల చివరి వారంలో హిడ్మా జాడపై పోలీసులకు కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా దళాలు లక్ష్యంగా అంబూష్ దాడులు చేయడంలో హిడ్మాకు ఉన్న ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని తొందరపడలేదని సమాచారం. ముందు జాగ్రత్తలో భాగంగా సెర్చ్ ఆపరేషన్‌ను రహస్యంగా కాకుండా బహిరంగపరిచారనే వాదనలు వినిపిస్తున్నాయి. జూన్ 29, 30వ తేదీల్లో ‘భద్రతా దళాల రాడార్‌లో హిడ్మా.. ఏ క్షణమైనా దాడి జరగొచ్చు’అంటూ సోషల్ మీడియాలో జోరుగా సాగిన ప్రచారం ఆ ముందు జాగ్రత్తలో భాగమేనని తెలుస్తోంది.
ఆ తర్వాత ‘ఇంద్రావతి’ప్రాంతంలో ఈనెల 5న జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సదరు వ్యక్తి మావోయిస్టు హిడ్మా ప్రధాన అనుచరుల్లో ఒకరని, పీఎల్‌జీఏ కంపెనీ–1లో స్నైపర్‌గా పని చేసేవాడని రెండు రోజుల తర్వాత బయటపడింది. దీంతో హిడ్మా బస చేసిన స్థావరం దగ్గరికి చేరినట్టుగా భద్రతా దళాలు అంచనా వేసి, గాలింపును మరింత ఉధృతం చేశాయి.
ఈనెల 6 నుంచి 8 వరకు ఆ ప్రాంతంలో జల్లెడ పట్టినా హిడ్మా, దేవాల జాడ దొరకలేదు. వర్షాల కారణంగా చిక్కబడిన అడవి, కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగులు సైతం భద్రతా దళాల వేగానికి ప్రతిబంధకంగా మారినట్టు సమాచారం. ఇదే సమయాన యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లోని టీమ్‌ల కన్నుగప్పి హిడ్మా తప్పించుకున్నట్టు తెలుస్తోంది.