20న మరో అల్పపీడనం | Heavy Rain In Telangana Upcoming Two Days | Sakshi
Sakshi News home page

20న మరో అల్పపీడనం

Sep 18 2020 5:03 AM | Updated on Sep 18 2020 10:23 AM

Heavy Rain In Telangana Upcoming Two Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

50 సిగ్నల్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌.. 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం హైదరాబాద్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో నగరంలో సుమారు 50 సిగ్నల్స్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటితో పలు బస్తీలవాసులు నానా అవస్థలు పడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement