ఐదు జిల్లాల్లో భారీ నష్టం ! 

Heavy loss in five districts - Sakshi

రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి 

వరి, పత్తి పూర్తిగా ధ్వంసం

జిల్లాల్లో పర్యటన తర్వాత కేంద్ర బృందం వెల్లడి 

సచివాలయంలో సీఎస్‌తో సమావేశం 

సాక్షి, హైదరాబాద్, బూర్గంపాడు: భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సలహాదారుడు కునాల్‌ సత్యార్థి వెల్లడించారు. వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలినలో తేలిందన్నారు.

ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో భారీ ఆస్తి నష్టం కలిగిందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కునాల్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం ఈ నెల 1 నుంచి 3 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది.

అనంతరం గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాతో సమావేశమై తమ పరిశీలనకు వచ్చిన విషయాలను వివరించింది. విపత్తుల నివారణకు కేంద్ర బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాంతి కుమారి తెలిపారు. 

కేంద్రానికి సమగ్ర నివేదిక అందిస్తాం 
గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో నష్టపోయిన పంటలను, ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం పరిశీలించింది. కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల దెబ్బతిన్న పంటలు, రహదారుల వివరాలను బృందం స భ్యులకు వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. పంట, రహదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు.  

ప్రభుత్వ వైఫల్యం వల్లనే అన్న బీజేపీ నేతలు 
వాతావరణశాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తగిన వేగంతో స్పందించకపోవడంతోనే తీవ్రనష్టం వాటిల్లిందని కేంద్ర వరద పరిశీలక బృందం దృష్టికి బీజేపీ ప్రతినిధి బృందం తీసుకొచ్చింది. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం మునిగిపోవడం వెనక రాష్ట్ర ప్రభుత్వ సమన్వయలేమి స్పష్టమైన ఉదాహరణగాకనిపిస్తోందని పేర్కొంది.

గురువారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు (పీపీ) కునాల్‌ సత్యార్థికి బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేత అశ్వథ్థామరెడ్డి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందేలా చూడాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top