
పోల్కంపల్లి వద్ద వాగులో గొర్రెలను ఒడ్డుకు చేరుస్తున్న పోలీసులు, గ్రామస్తులు
కల్వకుర్తిలో అత్యధికంగా 15 సెం.మీ. వర్షపాతం నమోదు
పరిగి మండలంలో కంపించిన భూమి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని చోట్ల వాగులు, కాల్వలు పొంగిపొర్లాయి. రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారాయి.
⇒ మహబూబ్‌నగర్‌లోని హనుమాన్‌పురా, అప్పన్నపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జీలకు ఉన్న రిటైనింగ్ వాల్స్ కూలిపోయాయి. దీంతో పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే 1,000 మంది విద్యార్థులతోపాటు అటు వైపు ఉన్న గొల్లబండతండాకు రాకపోకలు నిలిచిపోయాయి. జడ్చర్ల పరిధిలోని కావేరమ్మపేట వద్ద నల్లచెరువు కట్ట తెగి సమీపంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది.
⇒ జడ్చర్ల, మిడ్జిల్‌తోపాటు నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల్లో దుందుభి నది ఉధృతంగా ప్రవహించింది. మూసాపేట మండలంపోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, వాటి కాపరులు చిక్కుకుపోగా రిస్క్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
⇒ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ సమీపంలో దివిటిపల్లి నుంచి అమర్‌రాజా బ్యాటరీ కంపెనీకి వెళ్లే రోడ్డు వర్షం నీటికి పూర్తిగా ధ్వంసం కాగా.. గురువారం తెల్లవారుజామున సిబ్బందిని తీసుకువెళ్తున్న కంపెనీ బస్సు అందులో బోల్తా పడడంతో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
⇒ జడ్చర్ల వద్ద సర్వీస్‌రోడ్డుపై మోకాళ్లలోతు నీటి ప్రవాహంలో హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు, ఓ ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున నిలిచిపోయాయి. దీంతో వరద నీటిలో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రోడ్డుపైకి తీసుకొచ్చారు.
⇒ నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి.
⇒ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో 14.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో మరికల్ 12.62, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో 12.3 సె.మీ. వనపర్తి జిల్లాలో ఖిల్లాలాఘనపురంలో 11.68, పెద్దమందడిలో 10.33, వనపర్తిలో 9.88, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వరద బీభత్సం
హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. లోలెవల్ బ్రిడ్జీల వద్ద వరద ప్రమాదకరంగా మారింది.నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపైకి వరద భారీగా చేరింది. మేళ్లచెర్వు– కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన తోటలు నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యాయత్‌నగర్, హనుమాన్‌గండి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పత్తి చేలను వరద ముంచెత్తింది.