
మలక్‌పేట్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
జలమయంగా రహదారులు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
రోజంతా ముసురు.. కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు ప్రధాన రోడ్లు జలమయంగా మారగా.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అటు వాహనదారులు..ఇటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
మలక్‌పేట్‌జోన్ పరిధిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అలాగే డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మలక్‌పేట్, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది.
తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు పైనుంచి వస్తున్న వరదతో మలక్‌పేట్‌లోని మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపిశారు. అంతేగాకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు మూసీ తీరవాసులను అప్రమత్తం చేశారు.
దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట్, మున్సిపల్ కాలనీ, పద్మనగర్, కాలడేర, మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి, అజంపురా, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్‌కేపురం, ఐఎస్‌సదన్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతాల్లోని నాలాలు పూర్తిగా పూడుకుపోయి ము రుగునీరంతా రోడ్లపై కాలనీల్లో ప్రవహిస్తోంది. నాలాల్లోని పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేపట్టకపోవడంతోనే వరద సరిగా ప్రవహించలేక కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొంగుతున్న డ్రైనేజీలు
మలక్‌పేట్, ఎన్‌టీఆర్‌నగర్, అల్కాపురి, భగత్‌సింగ్‌నగర్, ఓల్డ్‌మలక్‌పేట్, తీగలగూడ తదితర కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పారుతున్న మురుగుతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షానికి లోతట్టు కాలనీల ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ముంపు సమస్యతో భయందోళన చెందుతున్నారు. మలక్‌పేట్‌లోని మూసీ లోతట్టు కాలనీల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటించి అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు.