‘నాలుగో వేవ్‌ చాన్స్‌ తక్కువే’

Health Director Srinivasa Rao Says Less Chance Of Fourth Wave Telangana - Sakshi

92.9 శాతం ప్రజల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నాయి

ఎక్స్‌ఈ వేరియంట్‌తో సాధారణ జలుబులానే ప్రభావం

ఆంక్షలు అవసరం లేదు

గుంపుగా ఉన్నప్పుడు మాస్క్‌ ధరించాలని సూచన 

‘‘రాష్ట్రంలో 92.9% మందిలో యాంటీబాడీలు ఇప్పటికే వృద్ధిచెంది ఉన్నాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. నాలుగో వేవ్‌ ఉండే అవకాశాలు లేవనేది నా విశ్లేషణ. అయితే ఇది నిర్ధారణ అవడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఒకవేళ 6– 8 వారాల్లో కేసులు పెరిగినా.. అవి అతి స్వల్పంగానే ఉండే అవకాశాలు ఎక్కువ. ఆందోళన అవసరం లేదు. ఒకవేళ నాలుగో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది..’’ 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజల్లో 92.9% మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తయిందని.. అందువల్ల కరోనా నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం తక్కువేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒకవేళ నాలుగో వేవ్‌ వచ్చినా దాని ప్రభావం స్వల్పమేనని.. కొత్తగా వచ్చిన ఎక్స్‌ఈ వేరియంట్‌ సాధారణ జలుబు మాదిరే ఉంటుందని చెప్పారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గత జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించారు. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.2 శాతం మందిలో.. అత్యధికంగా హైదరాబాద్‌లో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు సర్వేలో తేలింది. ఒకడోసు తీసుకున్న 91.4 శాతం మందిలో, రెండు డోసులు తీసుకున్న 96 శాతం మందిలో.. అసలు వ్యాక్సిన్‌ తీసుకోనివారిలో కూడా 77 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ’’ అని శ్రీనివాసరావు తెలిపారు. 

మాస్కులు, వ్యాక్సిన్‌ తప్పనిసరి 
కొత్తగా వచ్చిన ఎక్స్‌ఈ వేరియంట్‌ ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదైందని.. దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కరోనా సాధారణఫ్లూ దశకు చేరుకుంటుందని తెలిపారు. అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దని, ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించడం, మాస్కు పెట్టుకోవడం, టీకాలను తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఆంక్షలు అవసరం లేదని.. యధావిధిగా శుభకార్యాలు, ఇతర వేడుకలు జరుపుకోవచ్చని, కానీ గుంపుగా ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని చెప్పారు. 

కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి 
ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14 శాతమేనని.. రోజూవారీ కేసుల సంఖ్య 20–25 మధ్య నమోదవుతోందని చెప్పారు. మే నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలు, దూరప్రయాణాలు చేస్తుంటారని.. ఆ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించారు. 18–59 ఏళ్ల మధ్య వారికి ఉచితంగా బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top