సీఎం బావమరిదికి సిరులగనిగా సింగరేణి
జిలెటిన్ స్టిక్స్ కొనుగోలు, ఓబీ టెండర్లలోనూ అవకతవకలు
సింగరేణి కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి హరీశ్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : ‘సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మూడు సోలార్ పవర్ ప్లాంట్లలో దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెడుతున్నారు. ఎంఎస్‌ఎంఈలు పాల్గొనకుండా ఉండేందుకు 107 మెగావాట్లకు సింగిల్ టెండర్ పిలిచారు. సైట్ విజిట్ సరి్టఫికెట్ నిబంధన అడ్డుపెట్టి రూ.250 కోట్లు అదనంగా చెల్లించేలా తమకు అనుకూలంగా ఉండే గిల్టీ పవర్ లిమిటెడ్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో మెగావాట్‌కు రూ. 3 కోట్ల నుంచి రూ.3.10 కోట్ల వ్యయం అయ్యే వాటిని మెగావాట్‌కు అదనంగా రెండు కోట్లు చెల్లిస్తున్నారు’అని బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు.
‘సింగరేణి భూముల్లో ఏర్పాటయ్యే ఈ సోలార్ పవర్ ప్లాంట్లకు ఒక్కో మెగావాట్‌కు రూ.5.4 కోట్లు సింగరేణి సంస్థ.. సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. రామగుండం కేంద్రంగా కుంభకోణం జరిగింది. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటుకు సంబంధించిన మరో కుంభకోణంలో రూ.480 కోట్లకు అనుకూలమైన వారికి టెండరు కట్టబెట్టారు. రెండు కుంభకోణాల్లోనూ రూ.250 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్లు చేతులు మారాయి. శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ టెండర్ల బాగోతంపై విచారణ జరపాలి’అని శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు కోరారు.
‘సింగరేణిలో పేలుళ్ల కోసం వాడే జిలెటిన్ స్టిక్స్‌ను 30 శాతం అదనపు రేట్లకు కొనాలని కొందరు ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తే నిరాకరించిన సంస్థ డైరెక్టర్ జీవీ రెడ్డి రాజీనామా చేయగా, మరో డైరక్టర్ వీకే శ్రీనివాస్‌ను జీఎం హోదాలో వెనక్కి పంపారు. నైనీ బొగ్గు గని తరహాలోనే ప్రకాశం ఖనిలోనూ రూ.1,044 కోట్ల విలువ చేసే టెండర్‌ను సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో పిలిచారు. సైట్ విజిట్ విధానం తప్పు అని భావిస్తే ఈ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి.
శ్రీరాంపూర్‌లో ఓబీ తొలగింపు పని కోసం రూ.600 కోట్లతో టెండర్ పిలించారు. టెక్నికల్ బిడ్‌ను తెరిచినా ఫైనాన్షియల్ బిడ్ ఓపెనింగ్‌కు తేదీలు ఇచ్చి మరీ ఏడుమార్లు వాయిదా వేశారు. హైదరాబాద్ హోటళ్లలో సీఎం బావమరిది సృజన్‌రెడ్డి చేస్తున్న సెటిల్‌మెంట్లు కుదరకపోవడంతోనే ఇది వాయిదా పడుతోంది. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు అక్రమాలను కూడా త్వరలో బయటపెడతాం’అని హరీశ్‌రావు ప్రకటించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై విచారణ చేయించాలంటూ కిషన్‌రెడ్డికి రాసిన ఐదు పేజీల లేఖను హరీశ్‌రావు ఈ సందర్భంగా విడుదల చేశారు.
సీఎం బావమరిదికి సిరుల గని
సింగరేణి సంస్థ సీఎం రేవంత్‌రెడ్డి బావ మరిది సృజన్‌రెడ్డికి సిరుల గనిగా మారిందని హరీశ్‌రావు ఆరోపించారు. తన సోదరుడి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అధికారులకు ఓ మంత్రి లేఖ రాశాడన్నారు. సింగరేణి కుంభకోణంలో వాటాల పంచాయితీ కాంగ్రెస్‌కు ఉరితాడుగా మారడంతో ‘సిట్’పేరిట దృష్టి మళ్లింపు రాజకీయాలను రేవంత్ మొదలు పెట్టాడన్నారు.
సీఎం బావమరిది కోసం జరిగిన కుంభకోణంపై దేశవ్యాప్త చర్చ జరగడంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అత్యవసర భేటీ జరిపిందన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన బొగ్గు కుంభకోణంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. సింగరేణి సంస్థలో సోలార్ పవర్ స్కామ్‌తోపాటు మరికొన్ని కుంభకోణాలు జరిగాయని హరీశ్‌రావు ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘సిట్’అంటే స్క్రిపె్టడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌గా మారిందని దుయ్యబట్టారు.


